జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పైగా మలయాళ సినీ రంగంలో పలువురు నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ రాజీనామా చేశారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ నివేదిక పై సీనియర్ నటి ఊర్వశి కీలక వ్యాఖ్యలు చేశారు.
నటి ఊర్వశి మాట్లాడుతూ.. ‘ఈ విషయం నన్ను బాధించింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గురించి నిజంగా విని షాకయ్యాను. నాలాంటి ఎంతోమంది మహిళలు జీవనోపాధి కోసం సినిమాల్లో పని చేస్తున్నాం. కానీ, ఇలాంటి వారి మధ్య వర్క్ చేస్తున్నామని తెలిసి నాకు బాధగా ఉంది. నాకు భయమేస్తోంది. వ్యక్తిగతంగా నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొలేదు’ అని ఊర్వశి తెలిపారు.
ఊర్వశి ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ రోజుల్లో నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు సైతం ప్రతిక్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తుండేవారు. ఒక్కటి మాత్రం స్పష్టం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాలామంది నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మళ్లీ రిపీట్ కాకుండా.. మహిళల సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని తెలిపారు.