‘వాల్తేరు వీరయ్య’లో నాన్నగారిని చూస్తుంటే పండగలా వుంది – కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల

‘వాల్తేరు వీరయ్య’లో నాన్నగారిని చూస్తుంటే పండగలా వుంది – కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత కొణిదెల

Published on Jan 13, 2023 9:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నిన్న భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి సూపర్ సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రోల్ లో కనిపించి ఆకట్టుకోవడంతో పాటు, దర్శకుడు బాబీ ఆడియన్స్ అలరించేలా మూవీని తెరకెక్కించడంతో వాల్తేరు వీరయ్య కి అందరి నుండి అభినందనలు లభించాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీకి మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఇక ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సుస్మిత, తన ఆనందాన్ని మూవీ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చాలా కలర్ ఫుల్ గా అందంగా వున్నాయి. మీరు ఇందులో కోసం చేసిన రిసెర్చ్ గురించి చెప్పండి ?

ఈ కథ విన్నపుడు నాకు మనసులో కొన్ని ఆలోచనలు వచ్చాయి. దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు అవి చాలా వరకూ మ్యాచ్ అయ్యాయి. వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమాజినేషన్ వచ్చింది. బాబీ గారు ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే, మాకు నాన్న గారి వింటేజ్ లుక్ కావాలని చెప్పారు. మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో, అలా వింటేజ్ గ్యాంగ్ లీడర్ లాంటి మాంచి మాస్ లుక్ కావాలని చెప్పారు. నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. కాబట్టి నేను పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి, శ్రుతి హాసన్ గారికి వారివారి డిజైనర్స్ పని చేశారు. అందరం ఒక మంచి సమన్వయంతో పని చేశాం. ఫైనల్ గా మా అందరి కష్టం ఫలించి మూవీ పెద్ద సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది.

 

నాన్నగారి కాస్ట్యూమ్స్ కోసం ఆయనతో చర్చిస్తుంటారా ?

ఖచ్చితంగా ఆ విషయంలో ఆయనతో చర్చిస్తా. తనకి వున్న అనుభవంతో ఒక సీన్ లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు. అటువంటివి వాల్తేరు వీరయ్య మూవీలో ఆయన పాత్రకి మరింతగా హెల్ప్ అవడంతో పాటు అవి ఆ పాత్రకి సహజంగా నప్పాయి.

 

ఇందులో చిరంజీవి గారి లుక్స్ వింటేజ్ తో పాటు ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు వున్న్నాయి. ఈ విషయయమై కేర్ ఏమైనా రీసెర్చ్ వంటిది చేసారా?

వింటేజ్ లుక్ తీసుకురావాలి. అలా అని ఇది పిరియడ్ సినిమా కాదు కాబట్టి నేటి యవతకు కూడా నచ్చేలా ఉండాలని ఆలోచించాను. ఇప్పుడున్న ట్రెండ్స్ పై అవగాహన ఉండడంతో దానికి తగ్గట్లుగా ఆయన నప్పే డిజైన్స్, షర్ట్స్ ప్రత్యేకంగా రూపొందించాం.

 

వాల్తేరు వీరయ్యగా నాన్నగారిని తెరపై చూసినప్పుడు మీ ఫీలింగ్ ?

ఇది నాన్నగారి మోస్ట్ కంఫర్ట్బుల్ జోన్. చూస్తున్నపుడు అద్భుతంగా ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్న ప్రతి రోజ పండగలానే వుండేది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు, ఫైనల్ గా అవుట్ ఫుట్ బాగుండడం, సినిమా కూడా సక్సెస్ కావడం ఎంతో సంతోషకరం.

 

ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా వుంది ?

నిజానికి అమ్మ అయితే లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో చెప్పేస్తుంది. ఆమె ఇన్ పుట్స్ చాలా వుంటాయి. అలాగే ఎలావున్నా చరణ్ తప్పకుండా కాల్ చేస్తాడు. అందరికీ ఈ మూవీ బాగా నచ్చింది.

 

నాన్నగారు సినిమాలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని చూస్తున్నపుడు విజిల్స్ వేస్తుంటారా ?

ఇందులో ఎలాంటి మొహమాటాలు లేవు. ఆయన అభిమానిగా మేము కూడా చేసే పనే అది. ఉదయం నాలుగు గంటలకి టీం అందరితో కలసి షోకి వెళ్ళాం. అభిమానులతో పాటు ఈలలు గోలలు అరుచుకుంటూ వచ్చాం. దర్శకుడు బాబీ నాన్న గారికి పెద్ద అభిమాని కావడంతో పాటు అందరినీ ఆకట్టుకునేలా మూవీ తీశారు.

 

చిరంజీవి గారు సినిమాలో చాలా ఫిట్ గా కనిపించారు ? మరి ఆయన లుక్ విషయంలో మీరేమైనా ఫిట్ నెస్ టిప్స్ ఇచ్చారా ?

ఈ విషయంలో అంతా నాన్న గారి గొప్పతనమే అని చెప్పాలి. ఆయన హార్డ్ వర్క్ చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఫిట్ గా ఉంటేనే మూవీలో తన క్యారెక్టర్ ఫీల్ బాగుంటుందని కష్టపడ్డారు. అలా ఫిట్ గా వుండేవాళ్ళ కాస్ట్యూమ్స్ బావుంటాయి. దానిని మైండ్ లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆయన మెంటైన్ చేస్తూ వచ్చారు. హెల్త్ పట్ల ఆయన చాలా స్పృహతో వుంటారు. ఫైనల్ గా మేము అందించిన కాస్ట్యూమ్స్ ఆయనకి బాగా సెట్ అయ్యాయి.

 

డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పై దృష్టి పెట్టారు కదా , నాన్నగారితో సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా ?

నాన్నగారు లాంటి స్టార్ తో పని చేయాలని అందరు నిర్మాతలకు వుంటుంది. నిజానికి మిగతావారందరికీ చెప్పినట్లే నాకు కూడా ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దాం అని అంటారు. మేము కూడా ఆ వేటలోనే వున్నాం. కొంత టైం పడుతుంది.

చిరంజీవి గారు..ఇందులో ఇరవై ఏళ్ళు వయసు వ్యక్తిగా కనిపించారు, డిజైనర్ గా ఈ విషయంలో మీరు తీసుకున్న శ్రద్ధ ?

నాన్నగారు తన లుక్ ని యాటిట్యూడ్ ని యంగ్ చేసుకుంటూ వచ్చారు. నేను దానిని క్యాచప్ చేశానంతే. ఆ పాత్ర అటువంటిది కాబట్టి ఆయన దానిని బాగా ఓన్ చేసుకున్నారు.

 

రంగస్థలంలో రామ్ చరణ్ మాస్ గా డిజైన్ చేశారు, ఇపుడు నాన్నగారు, ఇద్దరిలో ఎవరు బాగా చేశారని అనుకుంటున్నారు ?

ఖచ్చితంగా నాన్నగారే. నాన్నగారంత చక్కగా ఈ మాస్ లుక్ ని మరొకరు చేయలేరని భావిస్తున్నాను.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ చెప్పండి ?

నాన్న గారు, మెహర్ రమేష్ గారి భోళా శంకర్ జరుగుతోంది. అలాగే రెండు వెబ్ సిరిస్ లపై వర్క్ చేస్తున్నాం. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు సినిమా విడుదలకు సిద్దంగా వుంది. ప్రస్తుతానికి అంతే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు