విడుదల తేదీ : నవంబర్ 22, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : జ్యోతిక, రేవతి, రాజేంద్రన్ యోగిబాబు, ఆనంద్ రాజ్ తదితరులు.
దర్శకత్వం : కళ్యాణ్
నిర్మాతలు : సూర్య
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫర్ : ఆనంద కుమార్
జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జాక్ పాట్’. రేవతి, ఆనంద్ రాజ్, కమెడియన్ యోగి బాబు నటిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
అక్షయ (జ్యోతిక)కు ఎవరూ లేకపోవడంతో మాషా (రేవతి) చిన్నప్పుడే అక్షయను చేరదీస్తోంది. అయితే అక్షయ, మాషా ఇద్దరు తమ తెలివితో తెలివైన ప్రణాళికలతో ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఆ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వారి టార్గెట్ అక్షయపాత్ర అవుతుంది. పురాణాల్లోని అక్షయపాత్ర అప్పటికే ఈ కాలంలోని కొంతమంది వ్యక్తులకు దొరుకుతుంది. అలా అక్షయపాత్ర గురించి తెలుసుకున్న అక్షయ, మాషా దాని కోసం చేసిన ప్రయత్నాలు ఏమిటి ? దాన్ని సంపాదించటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ? చివరికి అక్షయపాత్రను దక్కించుకున్నారా ? లేదా ? ఒకవేళ దక్కించుకుంటే దానితో వాళ్ళు ఏమి చేశారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
పురాణాల్లో అక్షయపాత్ర గురించి విన్నాం కదా.. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి శ్రీమహాలక్ష్మీ అమ్మవారు వచ్చినట్లే. ఆ పాత్రలో ఏమి వేస్తే అవి వస్తూనే ఉంటాయి. మరి ఎప్పటికీ తరగని ఆ అక్షయపాత్ర ఈ కాలంలో దొరికితే.. అదీ సమాజం గురించి ఆలోచించే ఇద్దరు ఆడవారికి అది దొరికితే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘జాక్ పాట్’లో కొన్ని కామెడీ సన్నివేశాలు మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఆకట్టుకుంటాయి.
ఇక ఈ చిత్రంలో అక్షయ పాత్రలో నటించిన జ్యోతిక తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. ఆమె అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే ఆమె మాడ్యులేషన్ ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి. మరో కీలక పాత్రలో నటించిన రేవతి కూడా అగ్రెసీవ్ పెర్ఫార్మెన్స్ తో కొత్తగా కనిపిచింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి. ఓ అమాయకపు సిన్సియర్ లవర్ గా రాజేంద్రన్ , అలాగే కామెడీ దాదాగా ఆనంద్ రాజ్, మరియు యోగిబాబు తమ నటనతో ఆకట్టుకుంటూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచారు.
మైనస్ పాయింట్ :
వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు కళ్యాణ్ కొత్త కథ రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ స్లోగా నడిచే సన్నివేశాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పైగా ఈ చిత్రంలో జ్యోతిక యాక్షన్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఓ మాస్ హీరో రేంజ్ లో ఆమె ఫైట్స్ చేసుకుంటూ పోతుంటే.. కాస్త కూడా నమ్మశక్యంగా అనిపించదు. పైగా ఆ యాక్షన్ సీన్స్ అన్నిటికీ సరైన మోటివ్ కూడా ఉండదు.
సినిమా మెయిన్ గా మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే జోనర్ అయినప్పటికీ దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకున్నే కామెడీ సన్నివేశాలు తప్ప, మిగిలిన భాగం అంతా సింపుల్ గానే నడిపించారు. బతుకులను మార్చే అక్షయ పాత్రను వెతికే క్రమం పెరిగే కొద్ది.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఈ చిత్రంలో చాలా తేలికపాటి సీన్స్ తోనే ముగించడం అంతగా రుచించదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు కళ్యాణ్ ఓ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ కళ్యాణ్ మాత్రం సెకెండ్ హాఫ్ ని సింపుల్ గా హ్యాండల్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే…విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం అయన స్థాయికి తగ్గట్టు లేదు. కానీ ఆయన అందించిన నేపధ్య సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. సినిమాటోగ్రఫర్ ఆనందకుమార్ కెమెరా పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా అయన దృశ్యాలని తెరకెక్కించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని నిర్మాత సూర్య పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
ముందు చెప్పుకున్నట్లు దర్శకుడు కళ్యాణ్ పురాణాల్లోని ఎప్పటికీ తరగని అక్షయపాత్రకు సంబంధించి చక్కటి పాయింట్ తీసుకున్నారు గాని, ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఇంట్రెస్ట్ పెంచే ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో ఇంకా ఆసక్తికరంగా సీన్స్ రాసుకున్నే స్కోప్ ఉన్నప్పటికీ, కళ్యాణ్ మాత్రం సాధారణంగానే నడిపించారు. కానీ సినిమాలో జ్యోతిక – రేవతి కాంబినేషన్ సీన్స్ మరియు ఆనంద్ రాజ్, రాజేంద్రన్ మరియు యోగిబాబు కామెడీ బి.సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతవరికి నిలబడుతుందో చూడాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team