జనార్ధన మహర్షి మన తెలుగు ప్రేక్షకాభిమానులకి సుపరిచితం. రచయితగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు ఆయన పని చేసారు. అలానే తెలుగు భాషా రచయితల్లో ఆయన ఎంతో ప్రాచుర్యం పొందిన వారు. ఆయన రాసిన నవలల్లో వెన్నముద్దలు, చిదంబర రహస్యం అత్యంత ఆదరణ పొందిన పుస్తకాలు. రచయితగా 2003 వ సంవత్సరంలో మొదటి కవితా సంకలనం వెన్నముద్దలు విడుదలయి తెలుగు ఆధునిక పుస్తక విక్రయాల్లో మొదటి 5 స్థానాల్లో ఒకటిగా నిలిచి, 12 ముద్రణలు వరకూ కొనసాగింది. అనంతరం 2004 లో మరింతగా ప్రజల్లోకి చేరుకోవడానికి పంచామృతాలు పేరుతో సరళమైన భాషలో, చిన్న చిన్న కథలుగా ఒక కథా సంకలనం విడుదలయి గొప్ప ఆదరణ పొందింది.
తరువాత 2007 లో గర్భ గుడిలోకి అనే సాత్వికమైన పేరుతో తాత్వికం, దార్శనికం మేళవించి ఎన్నో తత్వాలను విశిదీకరిస్తూ ఒక నవల రచించారు. అనంతరం దానినే గుడి గా విడుదల చేయగా 2012 లో కళాతపస్వి కె. విశ్వనాధ్ గారు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి నటించిన దేవస్థానం అనే చిత్రానికి నాంది పలికింది. ఆ చిత్రానికి రచయత, నిర్మాత, దర్శకుడు జనార్ధన మహర్షి కావడం అదనపు ఆకర్షణ. ఈ కథ వృత్తాంతం ఎందరో విమర్శకుల ప్రశంసలను ఇంకా మరెన్నో మన్ననలను, అభినందనలు పొంది 2021లో గర్భ గుడిలోకి గా రెండవ ప్రచురణలో కేవలం తెలుగులోనే కాకుండా ఈసారి కన్నడ భాషలోకి కూడా అనువాదమై విడుదలైంది. 2008 లో నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ అను కవితా సంకలనం ఒక అనూహ్యమైన ప్రయోగం.
రచయిత స్వీయచరితగా మొదలయి చదివే ప్రతి పాఠకుడి మనసుని, బుద్ధిని ఏకకాలంలో ఆలోచనల ప్రకంపనలు సృష్టించి, ప్రతి మాట వారికి ఆకళింపజేసుకునేలా చేసి చివరికి అది వారి చరితగా మలిచే ఒక విభిన్నమైన పుస్తకం. అందరూ ఒక్కసారైనా తప్పక చదవాల్సిన పుస్తకం. 2011 లో ప్రతి కవికి అంకితమిస్తూ విడుదలైన కవిగానే కన్నుమూస్తా అనే కవితా సంకలనం తెలుగు కవితా ప్రపంచాన్ని కదిలించింది. 2019 లో మధుర సంభాషణలు అనే సంభాషణా సంకలనాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో 190 కి పైగా సంభాషణలు మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి, ప్రశ్నిస్తాయి, పరామర్శిస్తాయి. వాస్తవిక ధోరణిలో, ఎంతో ముక్కు సూటిగా ఉండే ప్రశ్నలు మనల్ని తప్పక భావోద్వేగానికి గురిచేస్తాయి.
2019 లో ఒక 25 చిన్న చిన్న కథలతో వచ్చిన చిదంబర రహస్యం ఎన్నో ఆలోచనలు మరియు పాఠ్యాంశాలను తనదైన శైలిలో మనకి పరిచయం చేస్తుంది. ఈ పుస్తకంలో ఒక మార్మిక వాదం దాగుంది. 2022 లో దీని రెండవ ముద్రణ విడుదలైంది. 2021 లో వచ్చిన స్మశానానికి వైరాగ్యం అనే కథా సంకలనం ప్రతి మాట ఎంతో లోతుగా ఉండి, మనలో ఆలోచనలే కాకుండా ఎన్నో నూతన భావాలను ప్రేరేపిస్తాయి. 2022 లో వచ్చిన జన పదాలు ఒక నవ్య నూతన ప్రయోగం. రచయిత తాలూకు విన్నూతమైన ఆలోచనా ధోరణి మరియు రచన శైలిని మనకి పరిచయం అవుతుంది. ఈ విధంగా రచయితగా పాఠకుల మనసు దోచుకుంటూ మంచి పేరు సంపాదించారు జనార్ధన మహర్షి.