పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 AD ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా అత్యద్బుతమైన వీఎఫ్ఎక్స్ తో రూపొందించినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, అతడికి తోడుగా బుజ్జి అనే రోబోటిక్ కారు ఉండనుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ కంటే ముందే కల్కి చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుంది. బుజ్జి అండ్ భైరవ కి సంబంధించిన యానిమేషన్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ లో మే 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే అంతకంటే ముందే, అభిమానులు దీనిని ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. ఈ యానిమేషన్ సిరీస్ కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ను మే 30న ప్రపంచవ్యాప్తంగా స్క్రీనింగ్ చేయనున్నారు.
హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దుబాయ్, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి ప్రాంతాల్లో ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బుజ్జి, భైరవలను యానిమేషన్ రూపంలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.