ఎస్పీ బాలు కండిషన్ తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి కమల్ హాసన్

Published on Sep 25, 2020 12:07 am IST


ప్రసిద్ద గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆగష్టు 5 నుండి ఎంజీఎం ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆయనకు లైఫ్ సపోర్ట్ మీద వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్మో (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు చికిత్స చేస్తున్నారు. దీంతో మెల్లగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. కానీ ఇంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. తాజాగా ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్యం మీద హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

గత 24 గంటలుగా ఆయన హెల్త్ కండిషన్ బాగా క్షీణించిందని, అన్నిరకాల సదుపాయాలతో లైఫ్ సపోర్ట్ ఇస్తున్నామని, వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని తెలిపారు. బాలుగారి ఆరోగ్యం విషమించిందని తెలుసుకున్న నటుడు కమల్ హసన్ వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను చూసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కోట్లాది మంది అభిమానులు తమ గానగంధర్వుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అందరి ప్రార్థనలు ఫలించి బాలుగారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, మళ్లీ తన గానామృతాన్ని సంగీత ప్రియులకు పంచాలని 123 తెలుగు టీమ్ కోరుకుంటోంది.

సంబంధిత సమాచారం :

More