హీరో సూర్య హీరోగా రాబోతున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాత కేఈ జ్ఞానవేల్ తన పోస్ట్ లో రాసుకొస్తూ.. ‘కంగువా’ సినిమాను ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నాం. అయితే, తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేస్తున్నాం. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే మొదటిసారి. రీసెంట్ గా విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్ బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాం. ఇది విజయవంతమవుతుందని భావిస్తున్నాం’ అని నిర్మాత జ్ఞానవేల్ తన పోస్ట్ లో క్లారిటీ ఇచ్చారు.
అన్నట్టు కంగువా రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. ఇప్పటికే, పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయట. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.