ఓటీటీ సమీక్ష : ‘కన్నెడా’ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష : ‘కన్నెడా’ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

Published on Mar 26, 2025 12:22 AM IST

Kanneda Web Series

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మార్చి 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : పర్మిష్ వర్మ, అరుణోదయ్ సింగ్, రణ్‌వీర్ షోరె, ఆదర్ మలిక్, జీషన్ అయ్యుబ్, జాస్మిన్ బాజ్వా తదితరులు

దర్శకుడు :చందన్ అరోరా

నిర్మాతలు : కరిష్మా బంగేరా, సిద్ధాంత్ చావన్, సమీర్ ఖురానా, దివ్యాంశు నిఝార, అజయ్ రాయ్
సంగీతం : రాబీ అబ్రహం
సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి
ఎడిటర్ : నిఖిల్ పరిహార్, సౌరబ్ గౌర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

దర్శకుడు చందన్ అరోరా రచించి, డైరెక్ట్ చేసిన ‘కన్నెడా’ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1920ల నేపథ్యంలో సాగే ఈ కథలో భారతీయులు కెనడా దేశానికి వలస వెళ్తారు. నిమ్మా(పర్మిష్ వర్మ) కూడా అక్కడి వలస వెళ్లగా, అతడి పట్ల అక్కడి వారు జాత్యహంకారం ప్రదర్శిస్తారు. దీంతో అతడు ఎలాగైన సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు దల్జీత్(ఆదర్ మాలిక్)తో కలిసి పంజాబీ ర్యాప్ సాంగ్స్ పాడాలని నిర్ణయిస్తాడు. దీంతో పాటు కెనడాలో నెలకొన్న డ్రగ్స్ మాఫియాను ఏలుతున్న సరబ్(అరుణోదయ్ సింగ్) గ్యాంగ్‌లో నిమ్మా చేరుతాడు. ఆ తర్వాత అతడు డ్రగ్స్ మాఫియాలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.? అతడికి ఎలాంటి వారు శత్రువులుగా మారారు.? ర్యాప్ సింగర్‌గా నిమ్మా ఎలాంటి గుర్తింపు పొందాడు..? చివరకు నిమ్మా ఏ దారిలో పయనిస్తాడు..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్:

1920లలో భారత్ నుంచి ముఖ్యంగా పంజాబ్ నుంచి కెనడా వలస వెళ్లినవారికి అక్కడ ఎదురైన పరిస్థితులు, వారు ఎదుర్కొన్న జాత్యహంకార ఘటనలపై ఈ వెబ్ సిరీస్ కథను చాలా చక్కగా రాసుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు కావాల్సినంత ఎమోషన్ ఈ కథలో ఉండటం ప్లస్ పాయింట్. ఇక భారత్ నుంచి కెనడా వెళ్లిన హీరోకు అక్కడ ఎదురైన పరిస్థితులను చాలా చక్కగా ప్రెజంట్ చేశారు. దీంతో అతడు తీసుకున్న నిర్ణయాన్ని అతడు ఏ విధంగా సమర్ధించుకున్నాడనేది కూడా బాగా చూపెట్టారు.

అతడి ప్రయాణంలో డ్రగ్స్ మాఫియా పట్ల ఆకర్షితుడై అతడు ఎలాంటి అడుగులు వేశాడు.. ఈ సందర్భంలో అతడికి ఎదురైన పరిచయాలు, వారితో హీరో బాండింగ్ సీన్స్ బాగున్నాయి. మధ్యలో వచ్చే ర్యాప్ సాంగ్స్ కథను ఎంగేజింగ్‌గా ఉంచేందుకు ప్రయత్నించాయి. ఇక ఈ వెబ్ సిరీస్‌కు ప్రధానమైన బలాల్లో నటీనటుల పర్ఫార్మెన్స్ ఒకటి. పర్మిష్ వర్మ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అతడి నుంచి వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక రొమాన్స్, యాక్షన్‌కు కూడా ఎలాంటి కొదవ లేకుండా ఈ వెబ్ సిరీస్‌లో చూపెట్టారు.

హీరో ప్రయాణంలో చోటు చేసుకునే మలుపులను బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పోలీసులు ఈ డ్రగ్స్ మాఫియాను పట్టుకునేందుకు వేసే ఎత్తుగడలు.. వాటిని హీరో ఎలా పసిగట్టాడు అనేది చక్కగా చూపెట్టారు. హీరో పాత్రను క్లైమాక్స్‌లో చూపెట్టిన తీరు బాగుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి ఇంటెన్స్ కథలో స్క్రీన్ ప్లే మరికొంత గ్రిప్పింగ్‌గా ఉండి ఉండాల్సింది. కథలో బలం ఉన్నప్పటికీ ఇందులోని సీన్స్ ప్లే్స్‌మెంట్‌లో లోపాలు కనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్‌లో నటీనటులు చాలా మంది కనిపించినా, వారి పాత్రలకు ఇవ్వాల్సిన పూర్తి ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సరబ్ పాత్రలో అరుణోదయ్ సింగ్, బాజ్వా పాత్రలో రణ్‌వీర్ షోరె ఇందులో చేసిన పాత్రలు వారికి ఏమాత్రం సహాయపడలేదని చెప్పాలి.

ఇలాంటి పాత్రలకంటే బెటర్ పాత్రలు వారు చాలా చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు మరో మేజర్ డ్రాబ్యాక్ దీని స్క్రీన్‌ప్లే అండ్ రన్ టైమ్. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ వెబ్ సిరీస్ మరింత ఎంగేజింగ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఇక రన్ టైమ్ కూడా కొంతమేర ఈ సిరీస్‌కు మైనస్‌గా నిలిచింది. సంగీతం పరంగా కూడా పెద్దగా ఇంప్రెస్ చేసే అంశాలు లేవని చెప్పాలి.

సాంకేతిక వర్గం :

దర్శకుడు చందన్ అరోరా ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. దాన్ని వెబ్ సిరీస్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన విజయాన్ని సాధించాడని చెప్పాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆయన ఈ వెబ్ సిరీస్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మలిచేవారు. ఈ వెబ్ సిరీస్‌లోని పాటలు పూర్తిగా పంజాబీ ఫ్లేవర్‌తో ఉండటం నిరాశపరిచింది. బీజీఎం వరకు పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘కన్నెడా’ వెబ్ సిరీస్ చక్కటి కథాబలం ఉన్న సిరీస్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నటీనటులు పర్ఫార్మెన్స్‌లు, కథలోని ఇంటెన్సిటీ ఆకట్టుకుంటాయి. అయితే, స్క్రీన్ ప్లే, రన్‌టైమ్, మ్యూజిక్ లాంటి అంశాలు ప్రేక్షకులను మెప్పించవు. క్రైమ్ అండ్ యాక్షన్ సిరీస్ ఇష్టపడే వారు ఈ సిరీస్‌ను ఓ సారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు