సమీక్ష : కీ -స్లోగా సాగే సైబ‌ర్ క్రైమ్ డ్రామా !

Key movie review

విడుదల తేదీ : మే 11, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : జీవా, నిక్కి గల్రాని, అనైక సోటి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని తదిత‌రులు.

దర్శకత్వం : కలీస్

నిర్మాత : యస్. మైఖేల్ రాయప్పన్

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫర్ : అభినందన్. ఆర్


కలీస్ దర్శకత్వంలో జీవా – నిక్కి గల్రాని, అనైక సోటి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కీ’. సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌ గా తెలుగు అనువాదంగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

సిద్దు (జీవా) హ్యాకింగ్ లో జీనియస్. తానూ కనిపెట్టిన ‘బాషా’ అనే వైరస్ ద్వారా అమ్మాయిల ఫోన్ లు హ్యాక్ చేసి వాళ్ళ పర్సనల్ ఇన్ ఫర్మేషన్ని క్షణాల్లో తెలుసుకుటుంటాడు. ఆ విధంగానే వందన (అనైక సోటి)తో సిద్దుకి పరిచయం అవుతుంది. కానీ ఆ తరువాత అనుకోకుండా జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సిద్ధుకి సిరి (నిక్కి గల్రాని)తో పరిచయం, ఆ పరిచయం చివరికి ప్రేమగా మారడం జరుగుతుంది. ఇకంతా హ్యాపీ అనుకున్న టైంలో సిద్ధుని చంపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు.

ఆ క్రమంలో వందన దాచిన హార్డ్ డిస్క్ ద్వారా.. సిద్దుకి కొంతమంది హ్యాకర్స్ డిప్రెషన్ లో ఉన్నవారిని హ్యాక్ చేసి.. వాళ్ళను ఏమోసనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్లాన్ ప్రకారం వాళ్ళ చేత యాక్సిడెంట్ చేపించి కొంతమంది అమాయకులను చంపిస్తునారనే విషయం తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళే తనని చంపటానికి ప్రయత్నిస్తున్నారని సిద్ధుకి అర్ధమవుతుంది. మరి వారి నుండి సిద్ధు ఎలా తప్పించుకున్నాడు ? అసలు ఆ హ్యాకర్స్ ఎవరు ? వాళ్ళు ఎందుకు డిప్రెషన్ లో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు ? చివరికి సిద్ధు ఆ హ్యాకర్స్ ను అంతం చేశాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్ :

ద‌ర్శ‌కుడు క‌లీస్ సినిమాను సాంకేతికత‌లోని మ‌రో కోణాన్ని ట‌చ్ చేస్తూ కీ సినిమాను బాగానే తెర‌కెక్కించారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ‘కీ’ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో.. ఆ టెక్నాలజీ వల్ల ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుందనే విషయాన్ని హైలెట్ చెప్పిన మెసేజ్ బాగుంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన జీవా తన పాత్ర సిద్దు అనే హ్యాకర్ పాత్రలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా హ్యాకర్స్ ఎవరూ వాళ్ళను పట్టుకునే సన్నివేశాల్లో గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక జీవా సరసన హీరోయిన్స్ గా నటించిన నిక్కి గల్రాని, అనైక సోటి తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచారు. అలాగే హను అనే కీలక పాత్రలో కనిపించిన నటి కూడా ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. ఆమెకు పెద్దగా స్క్రీన్ టైం లేకపోయిన తన నటనతో ఆకట్టుకుంటుంది. జీవాకి తల్లి తండ్రులుగా నటించిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కలీస్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా.. ఆ ఐడియాకి సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. సినిమా మొదలయిన ఒక గంట వరకు ప్రేక్షకులకు ఒక క్లారిటీ అంటూ రాదు. హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే కొన్ని పరిచయ సన్నివేశాలు అయితే అసలు అనవసరం అనిపిస్తాయి.

పైగా కథలోని మెయిన్ ప్లాట్ చాలా పేలవంగా ఉంది. దానికి తోడూ లాజిక్స్ లేని సీన్స్ తో పండని కామెడీతో విసుగు వస్తోంది. మొత్తానికి దర్శకుడు కథా కథనాలన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే బాగుండేది.

అలాగే హీరో విలన్లకు మధ్య వచ్చే మైండ్ గేమ్ సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే కథనాన్ని నడిపారు. పైగా బి.సి ఆడియన్స్ కి ఈ సినిమా అస్సలు కనెక్ట్ అయ్యేలా లేదు. ఇక సినిమాలో తెలుగు ఆర్టిస్ట్ లు కనిపిస్తున్నా.. తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.

ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో జీవా – నిక్కి గల్రాని, అనైక సోటి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌ ఆకట్టుకునే విధంగా సాగలేదు. స్టోరీ ఐడియాకి తగ్గట్లు సరైన ట్రీట్మెంట్ ను లేకపోవడం, లాజిక్స్ లేని సీన్స్ ఎక్కువవడం, పైగా ఉన్న కంటెంట్ కూడా సరిగ్గా ఎలివేట్ అవ్వకపోవడం, బి.సి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా అస్సలు లేకపోవడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ డబ్బింగ్ సినిమా మాత్రం ఎక్కువమంది ప్రేక్షకులకు నిరాశనే మిగులుస్తోంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version