విడుదల తేదీ : మార్చి 21, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సంతోష్ కల్వెచెర్ల, క్రిషిక పటేల్, కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్, వినయ్ వర్మ తదితరులు.
దర్శకుడు : రతన్ రిషి
నిర్మాత: జేమ్స్ వాట్ కొమ్ము
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : చందు ఏజే సినిమాటోగ్రఫీ
ఎడిటర్ : ఆర్ ఎం విశ్వనాధ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “కిల్లర్ ఆర్టిస్ట్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
హైదరాబాద్ లో పిచ్చి రవి (కాలకేయ ప్రభాకర్) దారుణంగా ఒక ప్యాట్రన్ లో రేప్ లు చేస్తూ పలు మర్డర్స్ కూడా తాను చేసి మోస్ట్ వాంటెడ్ సైకో కిల్లర్ గా మారుతాడు. ఇంకోపక్క విక్కీ (సంతోష్ కల్వచెర్ల) తన చెల్లెలు స్వాతి (స్నేహ మాధురి) కలిసి అన్యోన్యంగా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అయితే ఓరోజు స్వాతి అనుకోని విధంగా దారుణంగా మానభంగానికి గురై చనిపోతుంది. ఇక్కడ నుంచి విక్కీ ఏం చేసాడు? ఆ మోస్ట్ వాంటెడ్ కిల్లర్ పిచ్చి రవిని పట్టుకుంటాడా లేదా? ఆ పిచ్చి రవి వెనుక ఎవరైనా ఉన్నారా? ఎందుకు విక్కీని తన చెల్లెలని టార్గెట్ చేశారు? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో సైకో కిల్లర్ పాత్ర వరకు డీసెంట్ లైన్ కనిపిస్తుంది. అలాగే అందుకు తగ్గట్టుగా కాలకేయ ప్రభాకర్ చేసిన పాత్ర అతను ఎందుకు ఆర్టిస్ట్ అని పిలుచుకుంటాడు అనే మోటివ్ కూడా బానే అనిపిస్తుంది. ఇలా తనపై కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది. అలానే ఫస్టాఫ్ లో కొంచెం కామెడీ అలానే కొన్ని క్రైమ్ మూమెంట్స్ డీసెంట్ గా కొనసాగుతాయి అని చెప్పవచ్చు.
ఇక హీరో సంతోష్ తన రోల్ లో ఓకే అనిపిస్తాడు కొన్ని సీన్స్ వరకు తన లుక్, నటన బాగున్నాయి. అలాగే హీరోయిన్ క్రిషిక పటేల్ కూడా బానే ఉంది. తన గ్లామర్ షో అలానే లవ్ సీన్స్ తో హీరోతో మంచి కెమిస్ట్రీ కనబరిచింది. ఇక వీరితో పాటుగా సైకో పాత్రలో కాలకేయ ప్రభాకర్ జీవించారని చెప్పవచ్చు. తనపై సీన్స్, తన నటన సాలిడ్ గా ఉన్నాయి. తనతో పాటుగా నటుడు భద్రం రోల్ కూడా బాగుంది. ఇక వీరితో పాటుగా నెగిటివ్ షేడ్స్ లో సత్యం రాజేష్, వినయ్ వర్మలు నటన పరంగా ఆకట్టుకుంటారు. అలాగే కొన్ని సీన్స్ లో కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో థీమ్ కొంతవరకు ఓకే కానీ చాలా డౌట్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. అసలు ప్రభాకర్ పాత్ర ఎందుకు సైకో వరకు ఓకే కానీ ఆర్టిస్ట్ గా ఎందుకు చూపించే సైకోయిజంలో తనని ఆర్టిస్ట్ గా గుర్తించాలి అనే పాయింట్ వీక్ గా ఉంది. అతను ముందు జీవితంలో ఏమన్నా ఆర్టిస్ట్ గా ట్రై చేసి గుర్తింపు తెచ్చుకోలేక తర్వాత ఇలా సైకో అయ్యాడా అనేలాంటి పాయింట్స్ చూపించి ఉంటే అది జస్టిఫికేషన్ లా ఉండేది.
ఇక వీటితో పాటుగా మరిన్ని లోపాలు సినిమాలో ఉన్నాయి. హీరోయిన్ తండ్రి పాత్ర ఒకపక్క పరువు అంటాడు ఇంకోపక్క కామం అంటాడు. అసలు అతను వచ్చిందే తక్కువ బ్యాక్గ్రౌండ్ నుంచి అని తన భార్య చెప్తుంది అలాంటి వ్యక్తి పరువు కోసం మాట్లాడ్డం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా చాలా సీన్స్ లో సహజత్వం లోపించింది.
హీరో ఇంకా హీరోయిన్స్ నటన పరంగా మరింత మెరుగు కావాల్సి ఉంది. చాలా సీన్స్ తో వారి ఎమోషన్స్ సరిగ్గా లేవు అనిపిస్తుంది. ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాల నిడివి అయినప్పటికీ అనవసరంగా అలా సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. హీరో బ్యాక్ స్టోరీ ఓకే కానీ కాలకేయ ప్రభాకర్ బ్యాక్ స్టోరీ మాత్రం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. అస్సలు ఇది ఎమోషనల్ గా కనెక్ట్ కాదు పైగా చాలా బోర్ కూడా అనిపిస్తుంది.
అనవసరంగా ఈ ట్రాక్ ని సాగదీసి అలా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక సంగీతం కూడా అందరికీ నచ్చకపోవచ్చు. ఒక ఎమోషన్ కి తగ్గట్టుగా బీట్స్ ఉండవు. బాధాకరమైన సమయంలో వాటికి స్టైలిష్ బీట్స్ ని కొడితే ఎలా ఉంటుందో అలా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఎస్పి చరణ్ పై ఓ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ తన గాత్రంలో వినేందుకు బాగుంటుంది కానీ దానికి ఆ మ్యూజిక్ సెట్ కానట్టు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఓకే అని చెప్పవచ్చు. టెక్నికల్ టీంలో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మరీ అంత ఆకట్టుకోలేదు. మెయిన్ గా పలు ఎమోషన్స్ కి తగ్గట్టుగా మంచి స్కోర్ పడలేదు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారో ఏమో కానీ అది కాస్త ఎమోషన్ ని పాడు చేసినట్టుగా అనిపిస్తుంది. చందు ఏజే సినిమాటోగ్రఫీ ఓకే, ఆర్ ఎం విశ్వనాధ్ కుంచనపల్లి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు రతన్ రిషి విషయానికి వస్తే.. తాను ఒక్క కిల్లర్ రోల్ లో సైకో ఎపిసోడ్స్ అలానే హీరో పాత్రపై కొన్ని ఎమోషనల్ సీన్స్ వరకు డీసెంట్ గా రాసుకున్నారు కానీ మిగతా సినిమా అంతటిపై కూడా ఎక్కువ వర్క్ చేయాల్సింది. చాలా మిస్టేక్స్ లాజిక్స్ ని మిస్సయ్యారు. వీటితో తన వర్క్ డిజప్పాయింట్ చేస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కిల్లర్ ఆర్టిస్ట్” లో కిల్లర్ కి ఒక మోటివ్ ఉంటుంది కానీ అది ఇంకా క్లియర్ గా ఉండాల్సింది. అలాగే కేవలం కొన్ని కామెడీ సీన్స్ కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే తప్ప మిగతా సినిమా అంతా చాలా బోరింగ్ గా సాగదీతగా సాగుతుంది. మెయిన్ గా సెకండాఫ్ లో కథనం ఇంకా బెటర్ గా చేయాల్సింది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team