ఓటిటి సమీక్ష : క్రాంతి – ఆహా వీడియోలో తెలుగు సినిమా

ఓటిటి సమీక్ష : క్రాంతి – ఆహా వీడియోలో తెలుగు సినిమా

Published on Mar 4, 2023 3:01 AM IST
Kranthi Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకుడు : భీమ శంకర్

నిర్మాత: భార్గవ్ మన్నె

సంగీత దర్శకుడు: జ్ఞాన్ సింగ్

సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయడిపు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


రాకేందు మౌళి మరియు బిగ్‌బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా ప్రధాన పాత్రలలో క్రాంతి అనే చిన్న చిత్రం నేడు డైరెక్ట్ గా ఆహా వీడియో లో విడుదలైంది. భీమ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

రామ్ (రాకేందు మౌళి) పోలీసు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. రామ్ మరియు సంధ్య (ఇనయ సుల్తానా) చాలా కాలం నుండి రిలేషన్ షిప్ లో ఉంటారు. తమ ప్రేమ విషయం గురించి తన తండ్రితో మాట్లాడాలని సంధ్య రామ్‌ని కోరుతుంది. కానీ మరుసటి రోజు, సంధ్య అనుమానాస్పద రీతిలో హత్యకి గురి అవుతుంది. ఈ విషయం తెలిసిన రామ్ చాలా షాక్ కి గురి అవుతాడు. అతను డిప్రెషన్‌లోకి వెళ్తాడు. సంధ్య మరణించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, రామ్‌ని తన సోదరుడిగా భావించే రమ్య (శ్రావణి శెట్టి) కనిపించకుండా పోతుంది. రామ్, రమ్య కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో, అతను కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటాడు. రమ్యకి ఏమైంది? రామ్‌ని ఆశ్చర్యపరిచిన ఆ విషయాలు ఏమిటి? రమ్యను రామ్ కాపాడాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

ఇండియా లో మహిళల భద్రత అత్యంత ఆందోళనకరమైన విషయాలలో ఒకటి అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై జరిగిన క్రూరమైన సంఘటనల గురించి ప్రజలకు తెలుసు. అలాంటి ఓ ఇష్యూని క్రాంతి చిత్రంలో డీల్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన డైలాగ్స్ చాలా బాగా రాసారు. తమ సమస్యలపై మహిళలు పోరాడే సన్నివేశాలు బావున్నాయి. క్లైమాక్స్ కూడా సినిమాకి ప్లస్ అని చెప్పాలి.

 

ఈ చిత్రంలోని హీరో రాకేందు మౌళి రామ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. తన ప్రియురాలి మరణంతో నిరాశకు లోనయ్యే వ్యక్తిగా రామ్ మంచి నటనను కనబరిచాడు. లీడింగ్ లేడీ ఇనయా సుల్తానా కొద్దిసేపే కనిపించినా, తన పాత్ర చాలా ఆకట్టుకుంటుంది. తన పాత్రకి బెస్ట్ ను అందించింది.

 

శ్రావణి శెట్టి, యమున శ్రీనిధి ల పర్ఫామెన్స్ బాగుంది. ఇతర నటీనటుల నటన బాగుంది. 90 నిమిషాల రన్ టైమ్ ఉండటం సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

 

డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ బాగుంటే సరిపోదు, దాన్ని ప్రేక్షకుడికి సరైన విధంగా చేరేలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. క్రాంతి విషయం లో అదే జరిగింది. అంతేకాక చాలా కథనం చాలా స్లో గా సాగుతుంది.

 

ఏకపాత్రాభినయంలా అనిపించే సంభాషణలు, ఆకట్టుకొని కెమెరా యాంగిల్స్, ఎగ్జైటింగ్ గా సన్నివేశాలు లేకపోవడంతో సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. చాలా అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాకి కావాల్సిన థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అయ్యింది.

 

సినిమాలోని డైలాగ్ లాగా, మేకర్స్ కొన్ని మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల ద్వారా చాలా ప్రభావితమయ్యారు. అందువల్ల ఆ చిత్రాలకు మరియు క్రాంతికి మధ్య సిమిలారిటీ ఉంది. కొన్ని సన్నివేశాలకు సరైన కనెక్షన్ లేదు.

 

సాంకేతిక విభాగం:

 

జ్ఞాన్ సింగ్ సంగీతం పర్వాలేదు. కిషోర్ బోయడిపు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ ఇంకా బాగా చేసే అవకాశం ఉంది.

 

దర్శకుడు భీమ శంకర్ విషయానికి వస్తే, స్త్రీల భద్రత గురించి సినిమా చేయాలనే అతని ఉద్దేశం బాగుంది. ఇలాంటి సినిమాలకి కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉండాలి. అందుకోసం డైరెక్టర్ ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ, అతను నటీనటుల నుండి మంచి పర్ఫార్మెన్స్ ను రాబట్టుకున్నాడు.
 

తీర్పు:

 

మొత్తం మీద, క్రాంతి చిత్రం తో డైరెక్టర్ భీమ శంకర్ చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా, దానిని స్క్రీన్ పై ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీయడానికి మరింత ఫోకస్ పెట్టి ఉంటె బాగుండేది. రాకేందు మౌళి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సన్నివేశాలు బాగున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ఆకట్టుకునే కథనం లేకపోవడం, స్లో గా సాగడం లాంటి అంశాలు సినిమా ఫలితం పై దెబ్బ తీశాయి. అయితే సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ కోసం ఈ వారాంతం ఒకసారి చూడవచ్చు.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు