విడుదల తేదీ : ఏప్రిల్ 12, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : మోహన్ లాల్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టివినో థామస్, సానియా ఐయప్పన్ తదితరులు.
దర్శకత్వం : పృధ్వీరాజ్ సుకుమారన్
నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసు దేవ్
సంగీతం : దీపక్ దేవ్
ఎడిటర్ : సంజీత్ మొహమ్మద్
జనతా గ్యారేజ్, మన్యం పులి’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
గ్రేట్ పొలిటీషియన్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ (సచిన్ ఖేడేకర్) మరణం తరువాత ఆయన వారసుడు ఎవరు ? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అన్న నేపధ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. అయితే పి.కె.అర్ కి అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ గట్టు పల్లి (మోహన్ లాల్) పి.కె.అర్ కి
తను ఇచ్చిన మాట ప్రకారం పి.కె.అర్ కుమార్తె ప్రియ (మంజు వారియర్)అండగా నిలబడి ఆమెను సమస్యల నుండి బయట పడేస్తాడు. కాగా ఈ క్రమంలో ప్రియ రెండో భర్త బాబీ (వివేక్ ఒబెరాయ్) వల్ల స్టీఫెన్ ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? ఆ సమస్యలకు తోడుగా కొంతమంది స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా స్టీఫెన్ పడిన నిందలు ఏమిటి ? ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ప్రియ (మంజు వారియర్)ను ఎలా సేవ్ చేశాడు ? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
స్టీఫెన్ గట్టుపల్లి అనే పాత్రలో మోహన్ లాల్ ఎప్పటిలాగే తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తెగా బాధ్యతగల మహిళగా నటించిన మంజు వారియర్ తన నటనతో ప్రియ అనే కీలకమైన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన దృశ్యాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.
ఇక సినిమాలో విలన్ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి మంజు వారియర్ కు చెప్పే సన్నివేశంలో ఆయన నటన చాలా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ సినిమాలో చెప్పాలనుకున్న స్టోరీ థీమ్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
పృధ్వీరాజ్ సుకుమారన్ మంచి స్టోరీ థీమ్ తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని పొలిటికల్ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. అయితే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమా స్లోగా సాగుతూ చాలా చోట్ల బోర్ కొడుతోంది.
ఇక కంటెంట్ మరియు ఆర్టిస్ట్ ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ పాయింట్ ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు. మొత్తానికి సినిమా నిండా ఎమోషన్ ఉన్నట్లే అనిపిస్తోంది కానీ.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ ఎమోషన్ సరిగ్గా ఎలివేట్ కాలేదు. దీనికి తోడు సినిమా ఎక్కువుగా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మంచి కంటెంట్ తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతుంది.
సంగీత దర్శకుడు దీపక్ దేవ్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకున్నేలా ఉంది. సుజిత్ వాసు దేవ్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కొన్నిచోట్ల పర్వాలేదనిపించినా.. ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరుస్తోంది. కానీ పృధ్వీరాజ్ సినిమాలో చెప్పాలనుకున్న స్టోరీ థీమ్ బాగుంది. కానీ సినిమాను మాత్రం ఆయన ఆసక్తికరంగా నడపలేదు. సినిమా నిండా ఎమోషన్ ఉన్నా .. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఆ ఎమోషన్ ఎలివేట్ కాలేదు. దీనికి తోడు సినిమా ఎక్కువుగా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. అయితే మోహన్ లాల్, వివేక్ ఒబెరాయ్ మరియు మంజు వారియర్ తమ నటన ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా పొలిటికల్ జోనర్ లో సినిమాను చూద్దామకునే ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నా.. మిగిలిన ప్రేక్షకులను మాత్రం నిరుత్సాహపరుస్తోంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team