విడుదల తేదీ : మార్చి 27, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓఐ తదితరులు
దర్శకుడు : కళ్యాణ్ శంకర్
నిర్మాతలు : హారిక సూర్యదేవర, సాయి సౌజన్య.
సంగీతం : భీమ్స్
సినిమాటోగ్రఫీ : షామ్ దత్,
ఎడిటర్ : నవీన్ నూలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మ్యాడ్ కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
(అశోక్) నార్నే నితిన్, సంగీత్ శోభన్ (డిడి అలియాస్ దామోదర్), మనోజ్(రామ్ నితిన్) ఈ ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత లడ్డు పెళ్లి కోసం కలుస్తారు. ఆ పెళ్లిలో జరిగిన అనేక నాటకీయ సంఘటనల నేపథ్యంలో లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి కూతురు లేచిపోతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఈ మ్యాడ్ బ్యాచ్ గోవాకి వెళ్తుంది. అయితే, గోవాలో ఈ బ్యాచ్ కి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అసలు గోవాలో మ్యాక్స్ (సునీల్)కి ఈ మ్యాడ్ బ్యాచ్ కి మధ్య సంబంధం ఏమిటి?, లాకెట్ కోసం మ్యాక్స్ ఏం చేశాడు ?, ఈ మధ్యలో ఈ మ్యాడ్ బ్యాచ్ ఎలాంటి పనులు చేసింది ?, చివరకు మ్యాడ్ బ్యాచ్ ఏం చేసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధానంగా సాగిన కామెడీ ఎపిసోడ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో పెళ్లి సీక్వెన్స్ అలాగే చాలా చోట్ల ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మొత్తానికి స్ట్రైకింగ్ కామెడీతో సినిమా మంచి ఫన్ మోడ్ లో సాగింది. మెయిన్ గా యూత్ ని ఆకట్టుకుంది. ఇక ఫ్రెండ్స్ గా కనిపించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సంతోష్ శోభన్ డీసెంట్ లుక్స్ అండ్ నీట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. నార్నే నితిన్ కూడా మంచి నటనను కనబరిచాడు.
అలాగే, విష్ణు ఓఐ, రామ్ నితిన్ తమ ఈజ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేసారు. ఇతర కమెడియన్స్ గా సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, నటుడు రఘుబాబు బాగానే నవ్వించారు. ఈ మ్యాడ్ బ్యాచ్ అనుకోని సంఘటనలతో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే ఆ సమస్యల నుంచి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఆ సన్నివేశాల్లో అందరి నటన చాలా బాగుంది. హీరోయిన్ గా నటించిన ప్రియాంక జావల్కార్ కూడా ఆకట్టుకుంది. తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది.
ప్రధాన పాత్రలను కథకు టర్నింగ్ పాయింట్స్ గా దర్శకుడు చాలా బాగా రాసుకున్నాడు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ను, అలాగే చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అదే విధంగా కొన్ని సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు.
మొత్తానికి ఈ చిత్రంలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు. దీనికితోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి. ఇవి అందరికీ ఎక్కకపోవచ్చు. వీటిని పక్కన పెడితే అసలు సినిమాలో ఒక కథాంశం అనేది ఏది లేదు. కొంచెం కొత్త కంటెంట్ కోరుకునే వారికి ఇది డిజప్పాయింటింగ్ గా అనిపించవచ్చు.
సాంకేతిక విభాగం :
ఈ చిత్రంలో మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు. ఇక టెక్నీకల్ టీం లో భీమ్స్ మ్యూజిక్ బాగుంది. ఆయన మార్క్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక షామ్ దత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే.. తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.
తీర్పు :
‘మ్యాడ్ స్క్వేర్’ అంటూ వచ్చిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా, మరియు నటీనటుల నటన.. మొత్తమ్మీద దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను ఎంటర్ టైన్ గా నడిపాడు. కాకపోతే, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team