విడుదల తేదీ : ఆగస్టు 09, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : నాగార్జున అక్కినేని, పి.కిరణ్
సంగీతం : చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : ఎం.సుకుమార్
ఎడిటర్ : ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2` నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే “మన్మధుడు 2” చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో పాటు,చిత్ర యూనిట్ విరివిగా ప్రమోషన్స్ నిర్వహించడంతో ప్రీ రీలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. మరి ప్రేక్షకుల అంచనాలు మన్మధుడు 2 ఎంత వరకు అందుకున్నాడో సమీక్షలో చూద్దాం…
కథ:
పొర్చుగల్ లో తరాలుగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన సామ్ (నాగార్జున) తల్లి(లక్ష్మీ), అక్క(ఝాన్సీ)తో కలిసి అక్కడే స్వేచ్చా జీవితం అనుభవిస్తూ ఉంటాడు. పెళ్లి, పిల్లలు వంటి సుదీర్ఘమైన బంధాలు ఇష్టపడని సామ్, తన తల్లి మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోర్చుగల్ లో ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న అవంతిక(రకుల్ ప్రీత్) ను తనను మోసగించి వెళ్లిపోయే ప్రియురాలిగా నటించమని చెవుతాడు. ఆ తరువాత కొన్ని అనుకోని మలుపుల కారణంగా సామ్ జీవితం తలకిందులవుతుంది. సామ్ జీవితంలో చేసిన తప్పులు ఏమిటి ? తాను చేసిన ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు ? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
నాగార్జున మన్మధుడు గా తన చార్మింగ్ గ్లామర్ తో ఆకట్టుకుంటాడు. ఆయనను ఈ చిత్రం లో చూసిన వారు ఎవరు ఆయనకు ఇంకొద్ది రోజులలో అరవై ఏళ్ళు వస్తాయంటే నమ్మరు. అంత యంగ్ గా నాగార్జున ఈ చిత్రంలో కనిపించారు. అలాగే జీవితాన్ని నచ్చినట్టుగా ఆస్వాదించే ప్లే బాయ్ పాత్రలో కానీ, కామెడీ పరంగా కానీ, ఎమోషన్స్ కానీ ఆయన చక్కగా పండించారు.
అలాగే గత చిత్రాలతో పోల్చితే రకుల్ కి అవంతిక పాత్ర ద్వారా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికిందని చెప్పవచ్చు. దర్శకుడు రాహుల్ రవీంద్ర ఆమె పాత్రను తెరపై చక్కగా ఆవిష్కరించారు. రకుల్ అటు గ్లామర్ పరంగా,నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
ఇక మూవీ ఆహ్లాదంగా సాగడంలో నటుడు వెన్నెల కిషోర్ కామెడీ చక్కగా పనిచేసింది. ఆయన కామెడీ టైమింగ్ తోపాటు, నాగార్జున కు ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. ముఖ్యముగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.
ఇక నటుడు రావు రమేష్ ని పూర్తిగా వినియోగించుకోలేదనే భావన కలిగినప్పటికీ, ఆయన సన్నివేశాలకు వరకు తనదైన శైలి, డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నాడు. ఇక సీనియర్ నటి లక్ష్మీ, ఝాన్సీ వాళ్ళ పాత్ర పరిధిలో చక్కగా నటించారు.
మైనస్ పాయింట్స్:
ఎటువంటి ట్విస్ట్ లేని ఈ రీమేక్ మూవీ ప్రేక్షకుడికి అంతగా థ్రిల్ చేయడంలో విఫలం చెందింది. కథలో కొత్తదనం లేకపోవడం, ఇలాంటి కథ ఇంతకు ముందు అనేక తెలుగు హిందీ చిత్రాలలో చూసిన భావన కలగడం ఈ మూవీ ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. దర్శకుడు రాహుల్ రవీంద్ర మొదటి సగం కొంచెం ఆహ్లాదంగా నడిపినా రెండవ భాగంలో కథను తేల్చేశాడు.
ఇక ఎడిటింగ్ లోపం వలన సెకండ్ హాఫ్ లో కథకు అంతగా అవసరం లేని అనేక సన్నివేశాలు మూవీ నిర్జీవంగా సాగడానికి కారణమయ్యాయి. నాగార్జున,రకుల్ దూరమైన తరువాత నడిచే కథగా అంతగా ఆసక్తిగా సాగలేదు.
విరామం తరువాత నెమ్మదిగా మొదలైన చిత్రం,వెంటనే పతాక సన్నివేశాలకు వెళ్లిన భావన కలగడంతో , మూవీ క్లైమాక్స్ కి ఆధారమైన ఎమోషన్స్ సరిగా తెరపై ఎలివేట్ కాలేదు.
ఇక ఈ చిత్రంలో సపోర్టింగ్ రొలెస్ చేసిన వారిలో ఒక్క ఝాన్సీ మినహా ఎవ్వరు అంతగా ఆకట్టుకోరు. అలాగే మూవీలో ఝాన్సీ కిస్సింగ్ సన్నివేశం లాంటి కొన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బందిగా ఫీలయ్యే సన్నివేశాలు ఉన్నాయి.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రం దాదాపు విదేశాల్లో చిత్రీకరించారు దీనితో కెమెరా వర్క్ తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ ఆహ్లాదంగా సాగింది. అలాగే పాటల సాహిత్యం మూవీ సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కగా కుదిరింది. ఎడిటింగ్ మాత్రం నిరుత్సహపరుస్తుంది. మూవీలో చాలా అనవసర సన్నివేశాలున్న భావన కలుగుతుంది. అలాగే నాగ్,రకుల్ ని అందంగా చూపించడంలో కాస్ట్యూమ్ వర్క్ ఆకట్టుకుంటుంది.
చిలసౌ లాంటి చిత్రం తరువాత దర్శకుడు రాహుల్ తీస్తున్న మన్మధుడు 2 చిత్రానికి మంచి నటులతో పాటు, నిర్మాణ సంస్థ దొరికింది. కానీ రాహుల్ వీటిని ఉపయోగించుకోవడంలో విఫలం చెందాడు. మూవీకి ప్రాణమైన ఎమోషన్స్ లేకపోవడంతో చిత్రం విలువ కోల్పోయింది. నాగార్జునను ఆయన తెరపై చూపించిన విధానం, ఆయన పాత్ర రూపొందించిన తీరు మాత్రం బాగుంది. మొదటి సగం పర్లేదు అన్నట్టుగా తీసిన రాహుల్ రెండవ భాగంలో మరింతగా ప్రేక్షకులను నిరుత్సహానికి గురి చేశాడు.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే మన్మధుడు మూవీ ప్రేక్షకుడి అంచనాలు అంతగా అందుకోలేదనే చెప్పాలి. నాగార్జున, రకుల్ పాత్రలను తెరపై చక్కగా చూపించిన దర్శకుడు రాహుల్ మిగతా విషయాలపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకుడికి కొంచెం ఉపశమనం కలిగించినా కొత్తదనం లేని కథ, ఎమోషన్స్ లేని సన్నివేశాలు మూవీ సోల్ ని దెబ్బతీశాయి. మరీ నిరాశ పరిచే చిత్రం కాకపోయినప్పటికీ ఎక్కువగా ఆశించివెళితే నిరాశ తప్పదు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team