కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, కొద్దికాలంగా హిట్ కోసం ఎంతగానో తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు మంచి గుర్తింపు తెచ్చిన డిఫరెంట్ కమర్షియల్ సినిమానే నమ్ముకొని ‘ఒక్కడు మిగిలాడు’, ‘గుంటూరోడు’ అన్న రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒక్కడు మిగిలాడు ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
దీపావళి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ఎల్‌టీటీఇ సంస్థ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ ఈ సినిమాలో కనిపిస్తారట. అజయ్ అండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మనోజ్ కెరీర్ బెస్ట్ నటన ప్రదర్శన కనబరచారన్న ప్రచారం జరుగుతోంది. ఆన్ అన్‌టోల్డ్ ట్రూ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.


