విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ తదితరులు
దర్శకుడు: వీఎస్ ముఖేష్
నిర్మాత: అఖిలేష్ కిలారు
సంగీత దర్శకుడు: సృజన్ శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటింగ్:
సంబంధిత లింక్స్: ట్రైలర్
పార్వతీశం, ప్రణీకాన్వికా ప్రధాన పాత్రల్లో వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో ‘మార్కెట్ మహాలక్ష్మి’ తెరకెక్కింది. బి2పి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని అఖిలేష్ కలారు ప్రొడ్యూస్ చేశారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే పార్వతీశం (పార్వతీశం), మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయి మహాలక్ష్మి (ప్రణీకాన్వికా)తో ప్రేమలో పడతాడు. మరోవైపు పార్వతీశం తండ్రి మంచి కట్నం తెచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇటు మహాలక్ష్మి ప్రేమకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య పార్వతీశం తన ప్రేమ కోసం ఏం చేశాడు ?, తాను కాయగూరలు అమ్మడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు ?, ఇంతకీ, ‘మార్కెట్ మహాలక్ష్మి’ ప్రేమలో పడిందా ? లేదా ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
మార్కెట్ లో కాయగూరలు అమ్మే అమ్మాయితో ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ? అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ప్రధాన కథాంశం బాగుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన పార్వతీశం చాలా బాగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు.. కామెడీ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో, తన టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రణీకాన్వికా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. హీరోకి ఫ్రెండ్ గా నటించిన ముక్కు అవినాష్ కూడా తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన హర్షవర్ధన్ మెప్పించాడు. మహబూబ్ బాషాతో పాటు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో క్లైమాక్స్ బాగానే ఉంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు.
మైనస్ పాయింట్స్ :
మార్కెట్ మహాలక్ష్మి సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్ గా సాగడం ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యింది. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే చాలా స్లోగా సింపుల్ గా సాగింది.
హీరో పార్వతీశం తాను ఎందుకు మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడో ప్రతి నాలుగు సీన్స్ కు గుర్తు చేస్తూనే ఉంటాడు. రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దర్శకుడు వీఎస్ ముఖేష్ ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు మరీ సిల్లీగా నడిచాయి. అయినా ఈ సిల్లీ లవ్ డ్రామాకు అంత పెద్ద ల్యాగ్ ఏమిటో డైరెక్టర్ కే తెలియాలి.
పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. సినిమా మొత్తం వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో పూర్తిగా సహజత్వం లోపించింది.
సాంకేతిక విభాగం :
ఈ చిత్ర దర్శకుడు వీఎస్ ముఖేష్ తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సినిమాలో సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాత అఖిలేష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘మార్కెట్ మహాలక్ష్మి’ అంటూ వచ్చిన ఈ లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఫ్యూ లవ్ సీన్స్ జస్ట్ ఓకే. కానీ, సింపుల్ స్టోరీ, స్లో నేరేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team