టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు మెగాస్టార్. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి సోదరిగా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగష్టు లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. మరోవైపు మొదటి నుండి పలు సామజిక సేవా కార్యక్రమాల ద్వారా తనవంతుగా ప్రజలకు సేవ చేస్తున్నారు మెగాస్టార్.
ఇప్పటికే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, చారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా మెగాస్టార్ చేస్తున్న సేవలపై ఎందరో గొప్ప ప్రసంశలు కురిపిస్తుంటారు. ఇక తాజాగా సీనియర్ విలన్ అయిన పొన్నాంబళం కి మెగాస్టార్ చిరంజీవి చేసిన గొప్ప సహాయం ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇటీవల మెగాస్టార్ తో తన ఆరోగ్య సమస్యలు చెప్పుకున్న పొన్నాంబళం, తనకు ఒక కిడ్నీ పూర్తిగా పాడయిందని తెలిపారు. అయితే అది విన్న మెగాస్టార్ ఒకరోజు ఫోన్ చేసి తనని అపోలో హాస్పిటల్ లో చేరమని చెప్పారట.
అయితే అక్కడి వైద్యులు పొన్నాంబళం కి పూర్తిగా ట్రీట్మెంట్ అందించారు. కాగా తన వైద్యానికి మెగాస్టార్ ని లక్ష లేదా రెండు లక్షలు అడుగుదాం అని భావించిన తన చికిత్సకు మొత్తంగా నలభై ఐదు లక్షల ఖర్చు కావడంతో ఆ మొత్తం ఖర్చుని మెగాస్టార్ స్వయంగా భరించారని ఆయన గొప్ప మనసు గురించి పొన్నాంబళం వెల్లడించిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనితో మరొక్కసారి మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసు చాటుకున్నారని తెలుస్తోంది.