ఇంటర్వ్యూ : లీలావతి – ‘నేను పవన్ కళ్యాణ్ టైపు..!’

Leelavathi
‘గంగ పుత్రులు’, ‘సొంత ఊరు’ వంటి చిత్రాల ద్వారా విమర్శకుల ప్రశంసలనూ, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ వంటి చిత్రాల ద్వారా బాక్సాఫీస్ విజయాలనూ సొంతం చేసుకున్న దర్శకుడు పీ. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మిస్ లీలావతి’. ఈ సినిమా రేపు (ఏప్రిల్ 3) విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిస్ లీలావతి’ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్న లీలావతి (స్క్రీన్ నేమ్)తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘మిస్ లీలావతి’ సినిమా గురించి చెప్పండి?

స) ఒక మంచి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన సినిమా ఇది. దర్శకుడు సునీల్ గారు చాలా బాగా తీశారు. ఈ సినిమాలో నాది చాలా కీలకమైన పాత్ర.

ప్రశ్న) మీ నేపథ్యమేంటి? ఈ సినిమా అవకాశమెలా వచ్చింది?

స) నా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని భోపాల్. కొంతకాలంగా ముంబైలో మోడలింగ్ చేస్తున్నాను. గతంలో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్‌లో పాల్గొన్నా. మోడలింగ్ చేస్తున్నపుడే దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ సినిమాలో నటించమన్నారు. ఇక్కడికొచ్చి ఆడిషన్ పూర్తి చేశాక హీరోయిన్‌గా అవకాశమిచ్చారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

స) ఈ సినిమాలో నాది చాలా కీలక పాత్ర. లీలావతి అనే పాత్రలో కనిపిస్తాను. నా స్క్రీన్ నేమ్ కూడా లీలావతియే. ఇక ఇందులో నా క్యారెక్టర్ వల్లే చాలా సమస్యలు పుట్టుకొస్తాయ్. బోల్డ్ పాత్రలో నటించాను. రియల్‌లైఫ్‌లో చాలా చోట్ల లీలావతి లాంటి వారిని చూస్తుంటాం. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది.. ‘నేను పవన్ కళ్యాణ్ టైప్, ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా!’ అని. ఈ డైలాగ్ ఆ పాత్రకు, నాకు సరిగ్గా సరిపోయే డైలాగ్.

ప్రశ్న) యాక్టింగ్ కోర్సు లాంటిదేమైనా చేశారా?

స) లేదు. మాములుగా అందరినీ బాగా అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు లాంటివి జాగ్రత్తగా గమనించేదాన్ని. దాంతో యాక్టింగ్ పెద్ద ఇబ్బందేమీ కాలేదు.

ప్రశ్న) లీలావతి పాత్ర కోసం ఏమైనా హోమ్‌వర్క్ చేశారా?

స) లీలావతి పాత్ర కోసం కొంత హోమ్‌వర్క్ చేశా. భాష విషయంలో దర్శకుడు సునీల్ గారు, నాతో పాటు నటించిన కార్తీక్, మహేష్‌లు చాలా సహాయం చేశారు. మంచి టీమ్ దొరకడంతో యాక్టింగ్ ఈజీ అయిపోయింది. ఇక ఈ సినిమాలో నేను సిగరెట్ తాగాలి. నాకేమో ఆ అలవాటు లేదు. సిగరెట్ తాగడానికి మాత్రం చాలా కష్టపడ్డా.

ప్రశ్న) కొత్త సినిమాలేవైనా ఒప్పుకున్నారా?

స) ఈమధ్యే రెండు అవకాశాలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం అవి డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తా.

Exit mobile version