మహేష్ బాబు-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం షూటింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు దగ్గర పడింది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాధ్ నివాసంలో సమావేశం జరగగా పూరీ జగన్నాధ్, సంగీత దర్శకుడు తమన్, చిత్ర నిర్మాత కె.సురేష్ రెడ్డి మరియు పాటల రచయిత భాస్కరభట్ల రవి కుమార్ హాజరయ్యారు. కొన్ని ప్రశ్నలకు వారు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆ ముచట్లు మీకోసం అందిస్తున్నాం.
ప్ర: బిజినెస్ మేన్ చిత్రాన్ని మొదటగా జనవరి 11న విడుదల చేస్తున్నామని ప్రకటించారు, ఇప్పుడు జనవరి 13న విడుదల చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఇది నిజమేనా?
పూరీ జగన్నాధ్: అవును మొదటగా జనవరి 11న విడుదల చేయాలనీ భావించాము. కానీ విదేశాలలో వీకెండ్ శుక్ర శని వారాలలో ప్రారంభమవుతుంది. బుధవారం విడుదల చేస్తే ఓపెనింగ్స్ కి సమస్య వస్తుందని విడుదల తేదీని జనవరి 13వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
ప్ర: బిజినెస్ మేన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది?
పూరీ: ప్రపంచవ్యాప్తంగా భారీగా ఇంతకు ముందెన్నడూ విడుదల కాని రీతిలో 1600 థియేటర్లలో విడుదల కాబోతుంది. అమెరికాలో అత్యదికంగా 100 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాము. రేపటి నుండి అడ్వాన్సు బుకింగ్ మొదలవుతుంది మరియు థియేటర్స్ కి సంబందించ పూర్తి సమాచారం కూడా రేపటి నుండి లభిస్తుంది.
ప్ర: ఈ చిత్రానికి ఎన్ని రోజులు పనిచేయడం జరిగింది? ఈ చిత్రానికి పని చేసేటప్పుడు మీ అనుభవం ఎలా ఉంది?
పూరీ: ఈ చిత్రం మొత్తం 74 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. హీరో మహేష్ బాబు గారు 65 రోజులు పని చేసారు. ఈ చిత్రాన్ని ఇంత తొందరగా పూర్తి చేయడానికి మహేష్ బాబు మరియు చిత్ర నిర్మాత కె.సురేష్ రెడ్డి గారే కారణం. వారిద్దరూ చాలా సహకారం అందించారు. నేను 3 నెలల ముందు ప్లాన్ చేసి పెట్టుకుంటే సురేష్ రెడ్డి గారు 6 నెలల ముందే పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుని సినిమా ప్రారంబించారు. సినిమా పూర్తయ్యాక ఇంత తొందరగా షూటింగ్ పూర్తయిందా అనిపించింది.
ప్ర: గతంలో మహేష్ బాబు గారితో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసారు. ఇప్పుడు మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్ మేన్’ ప్రేక్షకులను ఎంత వరకు సంతృప్తి పరుస్తుంది?
పూరీ: పోకిరి పూర్తి విరుద్ధమైన సబ్జెక్ట్ ఇది. పోకిరిలో ఉండే పంచ్ డైలాగ్స్ మరియు కామెడీ ఇందులో ఉండవు. ఆ పోకిరికి ఈ చిత్రానికి మహేష్ బాబు గారి గొంతు ఎంతో మారింది. ఈ చిత్రం ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. మహేష్ బాబు పాత్ర ఇందులో పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఎదుటి వారిని బెదిరిస్తున్నాడో బయపెడుతున్నదో తెలియని విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ పాత్రకు కనెక్ట్ అయితే అర్ధమయ్యే విధంగా ఉంటుంది.
ప్ర: ఈ చిత్రంలో మహేష్ బాబు మరియు కాజల్ మధ్య ముద్దు సన్నివేశం ఉంది అని అంటున్నారు అది నిజమేనా?
పూరి: (నవ్వుతూ) అవును ఉంది. కొద్ది సెకన్ల పాటు ఉంటుంది. ఈ సన్నివేశం నమ్రత గారు చూసి అంగీకారం తెలిపాకే చిత్రంలో పెట్టడం జరిగింది. ఈ చిత్రంలో మహేష్-కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మెలోడి పాటలకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఒక్కటే మెలోడి పాట పెట్టడం జరిగింది.
ప్ర: ఈ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో ఎప్పుడు విడుదలవుతుంది?
పూరీ: మొదటగా తెలుగుతో పాటు ఒకే రోజు మిగతా భాషల్లో విడుదల చేయాలనీ భావించినప్పటికీ ఆయా భాషల్లో కూడా భారీ చిత్రాలు విడుదలవుతుండటంతో 15 రోజులు ఆలస్యంగా విడుదల చేయబోతున్నాము. ఎన్ని థియేటర్లలో విడుదలవుతుంది తదితర పూర్తి విషయాలు త్వరలోనే తెలియజేస్తాము.
ప్ర: దూకుడు విజయం తర్వాత మళ్లీ మహేష్ బాబుతో చిత్రానికి సంగీతం అందించారు. మీరు ఫీలవుతున్నారు?
తమన్: దూకుడు విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద విజయం తరువాత బిజినెస్ మేన్ కి సంగీతం అందించాలంటే భయం వేసింది కానీ పూరీ జగన్నాధ్ మరియు భాస్కరభట్ల గారి సహకారంతో మంచి మ్యూజిక్ అందించటం జరిగింది. సన్నివేశాలు కూడా చాలా బావుండటంతో రీ రికార్డింగ్ కూడా అధ్బుతంగా వచ్చింది.
ప్ర: ‘సారోస్తరొస్తారా’ పాట ఇంత పెద్ద విజయం సాధించింది. ఆ పాట రాయడానికి ఇన్స్పిరేషన్ ఏమిటి?
భాస్కరభట్ల: తమన్ ఆ ట్యూన్ ఇచ్చినపుడు మొదట వేరే లైన్ అనుకోవడం జరిగింది. అది పూరీ గారికి, తమన్ కి కూడా నచ్చింది. కానీ ఇంకా బెటర్ గా చేద్దామనే ప్రయత్నంలో సారోస్తరొస్తారా లైన్ అనుకోవడం జరిగింది. ఈ పాట ఈ రోజు ఇంత విజయం సాధించిదంటే దానికి కారణం తమన్ కూడా కారణం.
123 తెలుగు.కామ్ టీం