సమీక్ష : L2 – ఎంపురాన్ (లూసిఫర్-2) – కొంతమేర ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా

L2Empuraan Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 27, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్, టొవినో థామస్, మంజూ వారియర్, జిరోమ్ ఫ్లిన్ తదితరులు
దర్శకుడు : పృథ్వీరాజ్ సుకుమారన్
నిర్మాత: ఆంటోని పెరుంబవూర్, గోకులం గోపాలన్
సంగీతం : దీపక్ దేవ్
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్
ఎడిటర్ : అఖిలేష్ మోహన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎంపురాన్(L2: Empuraan)’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందోఈ రివ్యూలో చూద్దాం.

కథ :
కేరళ సీఎం జతిన్ రామ్‌దాస్(టొవినో థామస్) అధికార పార్టీ నుంచి తప్పుకుని సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. అతడికి తోడుగా బాబా బజ్‌రంగ్ అలియాస్ బాలరాజ్(అభిమన్యు సింగ్) కూడా ఉంటాడు. ఆయన సోదరి ప్రియదర్శిని రామ్‌దాస్(మంజు వారియర్) ఈ నిర్ణాయాన్ని అంగీకరించదు. ఈ క్రమంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఖురేషి అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి(మోహన్ లాల్) రంగంలోకి దిగుతాడు. అయితే, అతడు ఓ డ్రగ్ దందాలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. స్టీఫెన్ రాకతో కేరళ రాజకీయాల్లో ఎలాంటి మార్పు జరుగుతుంది? బాలరాజ్‌తో అతడి వైరం ఏమిటి? జాయెద్ మసూద్(పృథ్వీరాజ్ సుకుమారన్)తో బాలరాజ్‌కు కనెక్షన్ ఏమిటి? అనేవి తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపురాన్ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌పై ప్రెజెంట్ చేశాడు. అంచనాలను మించి ఈ సినిమాను ఆయన తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులోని గ్రాండియర్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు అని చెప్పాలి.

ఇక మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆయన మరోసారి తనదైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సైలెంట్‌గా ఉంటూనే ఆయన చెప్పే డైలాగులు అభిమానులకు ట్రీట్ అందిస్తాయి. ఆయన పాత్రను చక్కగా డిజైన్ చేశారు. ఇక అడవిలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మంజు వారియర్ తన పాత్రలో ఆకట్టుకుంది. టొవినో థామస్ తన పాత్రలో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే, ఈ పాత్రను ఇంకాస్త బెటర్‌గా రాసుకోవాల్సింది. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర నిడివి తక్కువ అయినా, అది ఆకట్టుకుంది.

విజువల్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు సాధించింది. చర్చి ఫైట్ సీక్వెన్స్, మోహన్ లాల్ గ్రాండ్ ఎంట్రీ వంటి కొన్ని సీన్స్ హాలీవుడ్ స్టైల్ గ్రాండియర్‌లో చూపెట్టారు.

మైనస్ పాయింట్స్ :
ఎంపురాన్ చిత్రంలో మెచ్చుకోదగ్గ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఓవరాల్ కథ ఆకట్టుకునే విధంగా లేదని చెప్పాలి. కథను నెరేట్ చేయడం కంటే కూడా పాత్రలను ఎలివేట్ చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మురళీ గోపి రైటింగ్‌లో కొన్ని లోపాలు కనిపిస్తాయి. లూసిఫర్ సీక్వెల్‌కు ఉన్న క్రేజ్‌కు తగ్గట్టుగా ఇందులో డెప్త్ మిస్ అయ్యింది.

ఈ సినిమాలోని స్లో పేస్, అధిక రన్‌టైమ్ చిత్రానికి మైనస్ అని చెప్పాలి. దీని కారణంగా కొన్ని చక్కటి సీన్స్ కూడా ట్రాక్ తప్పినట్లు కనిపిస్తాయి. మోహన్ లాల్ పాత్ర బాగున్నా కథలో బలం లేకపోవడంతో సినిమా నీరసంగా కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలోని అధిక పాత్రలు కూడా సినిమాకు మైనస్ అని చెప్పాలి. చాలా పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. టొవినో థామస్ పాత్ర కథలో కొంతమేర సూట్ కాలేదని చెప్పాలి. ఇంద్రజిత్ సుకుమారన్ పాత్ర కూడా ఇదే తరహాలో అనిపిస్తుంది.

కథలోని చాలా అంశాలు ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయి. స్లో పేస్, కథలో కన్ఫ్యూజన్‌తో ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ను ప్రేక్షకులు ముందుగానే ఊహించగలడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ కథ నచ్చకపోవచ్చు.

సాంకేతిక వర్గం :
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ డీసెంట్‌గా ఉంది. పాత్రల ఎలివేషన్‌పైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మోహన్ లాల్ గ్రాండ్ ఎంట్రీ చూస్తే ఇది అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే పై మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఆడియెన్స్ ఈ సినిమాకు మరింత కనెక్ట్ అయ్యేవారు.

సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రపీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని గ్రాండ్ విజువల్స్‌ను ఆయన ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. దీపక్ దేవ్ బజీఎం పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఈ సినిమాకు డ్రా బ్యాక్ అని చెప్పాలి. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే ఈ చిత్ర కథ మరింత ఎంగేజింగ్‌గా ఉండేది. నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తీర్పు :
ఓవరాల్‌గా ‘ఎంపురాన్’ చిత్రంలో గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే ఎలివేషన్స్ ఉన్నప్పటికీ.. కథలో గ్రిప్పింగ్ అంశాలు, డెప్త్ వంటివి లోపించాయి. లూసిఫర్ చిత్రంలో ఉన్న కథాబలం ఈ సినిమాలో తగ్గినట్లు అనిపిస్తుంది. మోహన్ లాల్ పాత్ర సాలిడ్‌గా ఉన్నా, కథలోని స్లో పేస్, అధిక పాత్రలు, లెంగ్తీ రన్‌టైమ్ వంటి అంశాలు సినిమాకు డ్యామేజ్ చేశాయి. మోహన్ లాల్ అభిమానుల వరకు ఈ సినిమా నచ్చుతుంది. కామన్ ఆడియెన్స్ తక్కువ అంచనాలతో ఈ సినిమాకు వెళ్తే బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version