నమ్రత పోస్ట్ చూసి అప్సెట్ అయిన ఎం.ఎస్.రాజు

Published on Jan 16, 2021 1:21 am IST


ఏదైనా ఒక క్లాసికల్ సినిమా గురించిన ప్రస్తావన వస్తే హీరో, దర్శకుడు, హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల గురించి మాట్లాడుకున్నట్టే ఆ సినిమాను నిర్మించిన నిర్మాత గురించి కూడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ నిర్మాత ఆనాడు పూనుకోబట్టే ఆ సినిమా రూపొందింది కాబట్టి. ఆ సినిమా ఘనతలో హీరోతో సమానంగా ఆ సినిమా నిర్మాతకు గౌరవం, అభినందనలు అందజేయాలి. అలా ఇచ్చినప్పుడే ఆ నిర్మాతకు సంతృప్తి, ఉత్సాహం. కానీ అలా జరక్కపోతే, నిర్మాతను మర్చిపోతే.. ఆ నిర్మాతకు మనసు చివుక్కుమంటుంది. అలాంటిదే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు విషయంలో జరిగింది.

ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటే సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి నిర్మాత. ఆయన నుండి సినిమా వస్తోంది అంటే హిట్ ఖాయమనే బ్రాండ్ ఉండేది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఆయన సినిమా వచ్చిందంటే విజయానికి తిరుగుండదు. అందుకే ఆయన్ను సంక్రాంతి రాజు అని పిలిచేవారు. రాజుగారి నుండి వచ్చిన అద్భుతమైన సినిమాల్లో ‘ఒక్కడు’ కూడ ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఆ సినిమా 2003లో జనవరి 15న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అదే మహేష్ బాబును మాస్ హీరోగా నిలబెట్టింది.

ఇప్పటికీ మహేష్ కెరీర్లో ది బెస్ట్ అంటే ‘ఒక్కడు’ అనే అంటారు చాలామంది. ఈ సినిమా ఈ 15వ తేదీతో 18 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్బంగా మహేష్ సతీమణి నమ్రత మహేష్ సినిమాల్లో ‘ఒక్కడు’ ఒక క్లాసిక్ సినిమా అని, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అని, తనకు ఆల్ టైమ్ ఫెవరెట్ మూవీ అని, కాలంతో పాటు ఆ సినిమా వన్నె కూడ పెరుగుతూనే ఉందని ఇన్స్టాలో తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. మర్చిపోయారా ఏమో కానీ పోస్ట్ లో ఆమె మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను ప్రస్తావించి నిర్మాత ఎం.ఎస్.రాజు పేరును ప్రస్తావించలేదు.

దీంతో రాజుగారు కాస్త నొచ్చుకున్నట్టే ఉన్నారు. ఈ విషయాన్నే ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ‘పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ. గుడ్ లక్’ అంటూ ట్వీట్ పెట్టి మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇకపోతే ఈమధ్యనే రాజుగారు ‘ఒక్కడు’ సీక్వెల్ తీసే యోచనలో ఉన్నట్టు అన్నారు కూడ.

సంబంధిత సమాచారం :