ఆడియో సమీక్ష : పటాస్ – మాస్ ని మెప్పించే ఆల్బమ్.!

ఆడియో సమీక్ష : పటాస్ – మాస్ ని మెప్పించే ఆల్బమ్.!

Published on Jan 3, 2015 3:26 PM IST

pataas-audio-review
నందమూరి కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమా ఆడియోని జనవరి 1న ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. సాయి కార్తీక్ అందించిన ఈ ఆల్బమ్ లో మొత్తం ఐదు పాటలున్నాయి. ఈ ఐదు పాటల్లో ఒకటి బాలకృష్ణ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమా నుంచి రీమిక్స్ చేసిన ‘అరె ఓ సాంబ’ సాంగ్ కూడా ఉంది. కానీ ఆడియన్స్ డైరెక్ట్ గా థియేటర్ లో థ్రిల్ ఫీలవ్వాలని ఈ సాంగ్ ని ఆల్బంలో ఇవ్వలేదు. ఇక ఆల్బంలో ఉన్న నాలుగు పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : దమ్కీ మారో 01

గాయకుడు : టిప్పు

సాహిత్యం : శ్రీమణి
దమ్కీ మారో సాంగ్ ఆల్బంలో వచ్చే మొదటి సోలో సాంగ్. ఈ సాంగ్ హీరోపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. లిరిసిస్ట్ శ్రీమణి హీరో పాత్రని వివరిస్తూ ఈ పాటకి సాహిత్యాన్ని అందించాడు. ఈ పాట పూర్తిగా వింటే సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుందనే అంచనా వేసేయ్యచ్చు. అలాగే ఈ పాట స్టార్టింగ్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగులో లో వచ్చే బిట్ బాగుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కి ఉండాల్సినంత వాయిస్ బేస్ తోనే టిప్పు ఈ పాటని పాడాడు. అతని వాయిస్ ఈ పాటకి బాగా సెట్ అయ్యింది. ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్స్, కీ బోర్డ్, ట్రాంబోన్ వాడి సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ బాగానే ఉంది. కానీ ఈ పాటలో వచ్చే బీట్స్ ఎక్కడో విన్నట్టు ఉంటుంది.

2. పాట : ఓసి చిన్నదాన 03

గాయకుడు : రాహుల్ నంబియార్

సాహిత్యం : శ్రీ మణి

ఓసి చిన్నదాన పటాస్ ఆల్బంలో వచ్చే టీజింగ్ సాంగ్.. ఈ సాంగ్ మన హీరో హీరోయిన్ వెనుకబడుతూ, తన ప్రేమ గురించి చెబుతూ, తనని ప్రేమించమని విసిగించే సందర్భంలో వచ్చే అవకాశం ఉంది. ఈ పాటలో శ్రీమణి రాసిన సాహిత్యం ఒకసారి వినగానే బాగా నచ్చేలా ఉంది. ముఖ్యంగా పాట మధ్యలో ‘రాసులే ఇస్తా రాణిలా చూస్తా.. నీ బాంచన్ నన్ను లవ్వు చేయ్యవే’ అంటూ వచ్చే లైన్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. రాహుల్ నంబియార్ ఈ పాత్రకి తన గాత్రంతో ప్రాణం పోశాడు. సాయి కార్తీక్ ఈ పాటకి చాలా వినసొంపైన సంగీతాన్ని అందించాడు. ఈ పాటలో ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్స్ ని వినియోగించిన విధానం బాగుంది. ఈ పాత వినగానే అందరికీ నచ్చేస్తుంది.

3. పాట : టప్ప టపం 05

గాయనీ గాయకులు : ఎంఎల్ఆర్ కార్తికేయన్, సుచిత్ర

సాహిత్యం : తైదల బాపు

‘టప్ప టపం’ అంటూ సాగే ఈ పాట ఆల్బంలో వచ్చే ఫుల్ మాస్ సాంగ్. తైదల బాపు ఈ పాట సాహిత్యంలో తెలంగాణ, ఆంధ్ర పదాలను వాడారు. ఆ పదాలను పాడేటప్పుడు వచ్చే యాస బాగుంది. ముఖ్యంగా కార్తికేయన్ తమిళ సింగర్ కావడం వలన, తన వాయిస్ లో మన తెలుగు పదాలు వినడానికి చాలా కొత్తగా అనిపిస్తాయి. సుచిత్ర గారి వాయిస్ కూడా ఈ మాస్ సాంగ్ కి బాగా సెట్ అయ్యింది. ఇక సాయి కార్తీక్ బీట్స్ బాగానే ఉన్నాయి. కానీ ఈ పాటలో వచ్చే ట్యూన్ మొత్తం హిందీలో బాగా ఫేమస్ అయిన ఆర్ రాజ్ కుమార్ మూవీలోని ‘సారేకే ఫాలుసే’లానే ఉంటుంది. చెప్పాలంటే అదే బీట్ కి చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపిస్తుంది. ఫుల్ మాస్ గా ఈ పాటని తీస్తే ఆన్ స్క్రీన్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

4. పాట : పవర్ ఉన్నోడు 02

గాయకుడు : రంజిత్

సాహిత్యం : బి. సుబ్బరాయ శర్మ

‘పవర్ ఉన్నోడు’ సాంగ్ ఆల్బంలో వచ్చే టైటిల్ సాంగ్.. పాటలోని సాహిత్యం వింటుంటే ఈ పాటలో హీరోయిజంని, అలాగే విలన్ పై హీరో చేసే దండయాత్రని చూపించేలా ఉన్నాడు. అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ లో కూడా వాడుకునే అవకాశం ఉంది. సుబ్బరాయ శర్మ సాహిత్యం హీరో పాత్రని ఎలివేట్ చేసేలా ఉంది. రంజిత్ వాయిస్ కూడా ఈ పాటకి బాగా సెట్ అయ్యింది. సాయి కార్తీక్ ఈ పాటలో వెస్ట్రన్ టచ్ ఉండేలా కంపోజ్ చేసిన మ్యూజిక్ బాగుంది. ఎలక్ట్రిక్ వాయిద్యాలకి మంచి బీట్స్ ని మిక్స్ చేసి ఈ ట్యూన్ ని కంపోజ్ చేసాడు.

తీర్పు :

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. కావున డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్కడా రిస్క్ చెయ్యకుండా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ చేత మాస్ ఆడియన్స్ కి నచ్చేలా పాటలని కంపోజ్ చేసుకున్నాడు. పటాస్ మాస్ ని మెప్పించే ఆల్బం అని చెప్పొచ్చు. పైన చెప్పిన నాలుగు పాటల్లో నాకు నచ్చిన సాంగ్స్ ఆర్డర్ ఏంటంటే – ఓసి చిన్నదాన, టప్ప టపం, దమ్కీ మారో, పవర్ ఉన్నోడు. ఈ సినిమాలో రీమిక్స్ చేసిన ‘అరె ఓ సాంబ’ పాట సూపర్బ్ గా వచ్చిందని టీం చెబుతోంది. కావున కళ్యాణ్ రామ్ ఆ పాటతో థియేటర్స్ లో అభిమానుల చేత డాన్స్ చేయించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు