పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 AD’ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో, ఈ విజువల్ వండర్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ‘వరల్డ్ ఆఫ్ కల్కి’ అనే వీడియోలో నాగ్ అశ్విన్ వివరించారు.
ఇప్పటికే ఎపిసోడ్-1 ను మేకర్స్ రిలీజ్ చేయగా, తాజాగా ఎపిసోడ్-2 వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో నాగ్ అశ్విన్ ‘కల్కి’ మూవీలోని మూడు ప్రపంచాలను పరిచయం చేశాడు. ఈ సినిమాలో కలియుగం ముగిసిన తరువాత మిగిలిన ఆఖరి నగరంగా కాశీని డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే పాయింట్ తో కాశీ నగరాన్ని డిజైన్ చేయడం జరిగిందని..దీనికి చాలా సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఇక కాశీ పైన మరో ప్రపంచం కాంప్లెక్స్ కూడా ఉంటుంది. భూమిపై అంతరించిపోయినవన్నీ కాంప్లెక్స్ పై ఉంటాయి.
కాగా, ఈ సినిమాలో మూడో ప్రపంచం కూడా ఉంటుందని.. దాన్ని ట్రైలర్ లో చూపెట్టలేదని తెలిపారు. మూడో ప్రపంచం శంబాల.. కాశీ, కాంప్లెక్స్ లకు పూర్తి భిన్నంగా ఉంటుందని.. ఈ ప్రపంచంలో దేవుడిని బ్యాన్ చేశారని తెలిపారు. పూర్తి అడ్వాన్స్ చెందిన ప్రపంచంగా శంబాల ఉంటుందని తెలిపారు. శంబాల ప్రపంచంలో కల్కి అవతారం పుడుతుందని నమ్ముతారు. ఈ మూడు ప్రపంచాలను కలిపే ఒక పాయింట్ తో ఈ సినిమా కథ ముందుకు సాగుతుందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
‘కల్కి’ మూవీతో నాగ్ అశ్విన్ ఎవరూ ఊహించని కంటెంట్ తో రాబోతున్నాడనేది స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 27న రిలీజ్ కానుంది.