ఇంటర్వ్యూ: నాగ చైతన్య – బాలరాజు క్యారెక్టర్ చేయడం చాలా కష్టం

ఇంటర్వ్యూ: నాగ చైతన్య – బాలరాజు క్యారెక్టర్ చేయడం చాలా కష్టం

Published on Aug 10, 2022 9:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11 న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా యువ హీరో అక్కినేని నాగ చైతన్య పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.

అమీర్ ఖాన్ లాంటి వారితో కలసి నటించడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. కొన్ని సినిమాలు చేసిన తరువాత అందులో చేసిన ఎక్సపీరియన్స్, మూమెంట్స్ లైఫ్ లాంగ్ మనకు నేర్పిస్తుంటాయి అలాంటిదే ఈ సినిమా.

ఈ చిత్రంలో నాది కేవలం 20 నుండి 30 నిమిషాల పాత్ర మాత్రమే లాల్ తో కలిసి ఉంటుంది. ఫస్ట్ టైం నాకు కాల్ వచ్చినప్పుడు నేను నమ్మలేదు. సాయంత్రం అమీర్ ఖాన్ డైరెక్టర్ అద్వైత్ చందన్ వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఇది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అమీర్ గారు ప్రి ప్రొడక్షన్ కు చాలా టైమ్ తీసుకోవడం వలన ఆ తరువాత తనకు షూట్ చాలా ఈజీ అవుతుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూయించకుండా అద్భుతంగా నటించాడు. అమీర్ ఖాన్ గారు చాలా డిసిప్లేన్ పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. తనతో నటించడం వలన తననుండి చాలా నేర్చుకున్నాను.

అమీర్ లాంటి యాక్టర్ పక్కన చేయడం వలన చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు బాలరాజు. బాలరాజు క్యారెక్టర్ నాకు స్పెషల్ గా అనిపించింది. 1948 లో తాతగారు ఈ టైటిల్ పేరుతో నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యిందని, నాకు చాలా హ్యాపీ అనిపించడమే కాక బ్లెస్సింగ్స్ కూడా వున్నట్టు అనిపించింది.

గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు అర్మీ లో జాయిన్ అయిన విధానం ఇందులో చాలా చక్కగా చూయించడం జరుగుతుంది. ఇందులో తెలుగు నేటివిటీ చాలా వరకూ కనిపిస్తుంది. ఈ సినిమాను తెలుగు జిల్లాలలో కూడా షూటింగ్ చేయడం జరిగింది. చిరంజీవి గారు పర్సనల్ గా తీసుకొని విడుదల చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని రివ్యూస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారని ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు నిరూపించాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చడమే కాకుండా, చూసిన ప్రతి ఇండియన్ కూ రిలేట్ అవుతుంది.

వెంకీ మామ లో నేను ఆర్మీ క్యారెక్టర్ చేసినా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ చిత్రంలో కార్గిల్ లో జరిగిన ఒక సీన్ ను తీసుకొని చేయడం జరిగింది. ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి. హిందీలో ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీ. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నా కూడా పాన్ ఇండియా మూవీ అవ్వడంతో నాకు చాలా నెర్వస్ గా కూడా ఉంది. ఇది 1975 నుంచి తీసుకున్న సినిమా. కానీ పిరియాడిక్ మూవీ కాదు.

ఇండస్ట్రీ అనేది చాలా క్రియేటివిటీ ఫీల్డ్. టెక్నికల్ గా ఇక్కడికి అక్కడికి తేడా అనేది ఏమీ లేదు. ఒకదానికి ఒకదానికి నేనెప్పుడూ కంపేర్ చేసుకోను. ఒక్కో డైరెక్టర్కి ఒక్కొక్క విజనరీ, క్రియేటివిటీ ఉంటుంది. అంతే కానీ వారిని వీరిని కంపెర్ చేసుకోలేను డైరెక్టర్ అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్ తను నాకు చాలా బాగా గైడ్ చేశాడు. నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను స్పెషల్ క్యారెక్టర్స్ అంటూ ఏమి చేయలేదు. ఇందులోనే మొదటిది. ఇకముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. అయితే అమీర్ గారి పక్కన చేయడం హ్యాపీ గా వుంది. అయన పక్కన చేసిన వారంతా కచ్చితంగా షైన్ అవుతారు అమీర్ ఖాన్ సినిమాను గమనిస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హైలెట్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ తో పాటు అయన పక్కన ఉన్న క్యారెక్టర్ కు కూడా వ్యాల్యూ ఉంటుంది.

బంగార్రాజు, థాంక్యూ రెండు సినిమాలలో నటించినా బంగార్రాజు నాకు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ లాగా అనిపించింది. అలాగే అమీర్ ఖాన్ గారు ఆన్ సెట్ లో,ఆఫ్ సెట్ లో ఉన్నా కూడా ఒకేలా ఉంటారు. కెమెరా ఆఫ్ చేసినా కూడా ఆయన పాత్ర నుంచి బయటకు రారు అంత డెడికేటెడ్ గా ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు