మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోతున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తుండగా.. చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..
‘శైలజా రెడ్డి అల్లుడు’లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నా కెరీర్ లో నేను ఫస్ట్ టైం ఫుల్ ఎంటర్టైనింగ్ రోల్ లో నటించింది ఈ సినిమాలోనే అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇంకా దగ్గరవుతాను. సినిమాలో నా పాత్రకు ఎలాంటి ఇగో ఉండదు. ఎప్పుడు చాలా కూల్ గా ఉంటాడు. ఏ సమస్య వచ్చిన అంతే కూల్ గా డీల్ చేసే పాత్ర నాది. ఇలాంటి రోల్ నా దగ్గ్గరకి తీసుకొచ్చిన మారుతికి మీ ద్వారా థాంక్స్ చెప్తున్నాను.
ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా ప్రధానంగా దేని గురించి ఉండనుందో చెప్తారా ?
‘శైలజా రెడ్డి అల్లుడు’ అని ఈ సినిమా టైటిల్ ఎప్పుడైతే ఎనౌన్స్ చేశామో అప్పటినుంచి ఇది అత్తా అల్లుడు సినిమా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అత్త అల్లుడు మధ్య జరిగే రివెంజ్ డ్రామా ఈ సినిమా కథ అని ఇలా చాలా రకాలు గాసిప్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా అలా అస్సలు ఉండదు. పూర్తిగా డిఫరెంట్. అంటే.. మనిషికి ‘ఇగో’ అనేది ఎక్కువైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని కామెడీగా చూపించాము. అదేవిధంగా ‘ఇగో’ లేకపోతే ఎంత మైందితోనైనా ఎలా సరదాగా ఉండొచ్చు అని కూడా ఒక చిన్న మెసేజ్ కూడి ఉంటుంది ఈ సినిమాలో. వీటిన్నిటితో పాటు మంచి ఎమోషన్స్ తో వెరీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ సినిమా.
రమ్యకృష్ణ గారి లాంటి సీనియర్ నటితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?
రమ్య కృష్ణ గారు, నాన్న గారి కాంబినేషన్ లో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. నాకు గుర్తున్నంతవరకు ఆ సినిమా ఇప్పటికి 30 సార్లు చూసి ఉంటాను. ఇక రమ్య కృష్ణగారు చెప్పాలంటే బాహుబలి తరువాత ఆవిడ నేషనల్ వైజ్ గా స్టార్ అయిపోయారు. అంతటి నటితో నటించాల్సి వచ్చినప్పుడు మొదట్లో కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను. (నవ్వుతూ) తరువాత అలవాటు అయిపొయింది. ఈ సినిమాలో మెయిన్ గా మా ఇద్దరి మధ్య వచ్చే లాస్ట్ 30నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుంది.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ చాలా బాగా వచ్చిందని విన్నాము ?
అవునండి. చాలా బాగా వచ్చింది. వెన్నెల కిషోర్ కోసం మారుతీ ఒక అద్భుతమైన కామిక్ రోల్ రాశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయి. సెకెండాఫ్ లో కిషోర్ డాక్టర్ గా వచ్చి 30 ఇయర్స్ పృథ్వితో పగలబడి నవ్వేలా నవ్విస్తాడు.
‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సినిమాలను మీరు చేస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మీ నుంచి అలాంటి సినిమాల్ని ఆశించ వచ్చా ?
టాలీవుడ్ లో ఈ మధ్య కొంచెం వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాల్ని నేను చూసాను. నాకు బాగా నచ్చాయి. కానీ నేను అలాంటి సినిమాలు అలాంటి తీవ్రమైన పాత్రలు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు టైం ఉందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో మాత్రం అలాంటి సినిమాలు చేస్తాను.
మీ నాన్నగారి లాగే మీరు కూడా ఆ మధ్య ఎక్కువుగా కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఎందుకు కొత్త డైరెక్టర్స్ తో పని చెయ్యట్లేదు ?
నేను మొదటినుంచి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూన్నాము. మొన్న ‘చి ల సౌ’ని కూడా ఆ ఉద్దేశ్యంతోనే రిలీజ్ చేసాము. కానీ కొత్త దర్శకులతో పనిచెయ్యటం నా వరికి నాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి అయితే కొత్త డైరెక్టర్లతో పని చేయకూడదు అనుకుంటున్నాను.