తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడంపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ కారణమని ఆమె ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని త్వరగా విడిపోవడం.. సినిమా రంగం నుండి ఫేడవుట్ కావడానికి కేటీఆర్ కారణమని ఆమె అన్నారు.
కొండా సురేఖ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినిమా వారి జీవితాలను తమ ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు వాడుకోవద్దని.. మహిళా మంత్రిగా ఉన్న సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, అసంబద్ధమని ఆయన అన్నారు. వెంటనే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలా సినిమా వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయ నేతలు తమ అవసరాల కోసం వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదని పలువురు నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర చర్చ సాగుతోంది.