విడుదల తేదీ : మే 31, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : సూర్య శివకుమార్,సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం : సెల్వ రాఘవన్
నిర్మాత : ఎస్ ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు ఎస్ ఆర్
సంగీతం : యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫర్ : శివకుమార్ విజయన్
సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కాంబినేషన్లో టాలెంట్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ “ఎన్ జి కె”. ఈ మూవీ భారీ అంచనాల మధ్య నేడు విడుదలైంది. సూర్య స్టార్డమ్ తో పాటు, సెల్వ రాఘవన్ గత చిత్రాలు బృందావన కాలనీ, యుగానికొక్కడు తెలుగులో మంచి విజయాలు సాధించడం తో ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఎంత వరకు అందుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
ఎం. టెక్ చదివిన నందగోపాల్ (సూర్య) ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని, ఉద్యోగం వదిలేసి, సొంత ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెడతాడు. స్వతహాగా సోషల్ అక్టీవిస్ట్ అయిన గోపాలం తన చుట్టూ ఉన్న ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉంటాడు. ఐతే కొన్ని సంఘటనలు ప్రజలకు మంచి చేయాలన్నా, వ్యవస్థలను శాసించాలన్నా రాజకీయ నాయకుల వల్లే అవుతుందని గ్రహించి, ప్రతిపక్ష పార్టీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తగా జాయిన్ అవుతాడు. మరి గోపాల్ పాలిటిక్స్ లో ఉన్నత స్థితికి చేరుకున్నాడా?ఈ నేపథ్యంలోనే రకుల్ పాత్ర ఏమన్నా ఇంపార్టెన్స్ ను చూపిందా?నందగోపాల్ తను అనుకున్న లక్ష్యాలను ఎలా ఛేదించాడు అన్నదే అసలు కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో చెప్పుకో దగ్గ కొన్ని విషయాలలో సూర్య నటన ఒకటి. ఎమ్మెల్యే కి దగ్గరవడానికి నందగోపాల్ నటించే తీరు, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలలో సూర్య నటన ఆకట్టుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ కి పొలిటికల్ సలహాదారుగా రకుల్ చాలా ట్రెండీగా, గ్లామరస్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో సిద్ శ్రీరామ్ పాడిన రకుల్ సూర్యాల మధ్య వచ్చే మెలోడీ సాంగ్ బాగుంది.ఇక సాయి పల్లవి సూర్య భార్యగా గీత పాత్రలో మెప్పించింది.
మైనస్ పాయింట్స్:
ఈ మూవీకి పెద్ద మైనస్ సెల్వ రాఘవన్ డైరెక్షన్. ఈ సినిమా చూశాక బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలు తీసింది ఈయనేనా అనే అనుమానం రాకమానదు. సాధారణ కార్య కర్త సీఎం గా ఎదిగినట్లు ప్రేక్షకుడిని నమ్మించాలంటే చాలా బలమైన సన్నివేశాలు ఉండాలి.అలాంటి ఒక్క సన్నివేశం కూడా మనకు కనిపించదు. సీరియస్ పొలిటికల్ డ్రామాలో భర్తను అనుమానించే సాయి పల్లవి పాత్ర అసలు ఇమడదు.అసలు సాయి పల్లవి పాత్ర లేకుండానే, రకుల్ తో ఈ మూవీ చేసినా సరిపోతుంది కదా అనే భావన కలుగుతుంది.కొన్ని సన్నివేశాలు చూస్తుంటే కార్తీ చేసిన శకుని గుర్తుకు వస్తుంది. నందగోపాల్ ఒక్క స్పీచ్ తో కార్యకర్తలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడ్ని, సజీవదహనం చేయడం, నందగోపాల్ సీఎం ఐపోవడం వంటి సన్నివేశాలతో చకచకా శుభం కార్డు వేసేశారు.
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా మూవీ స్క్రీన్ ప్లే అనేది సరిగా లేదు. అస్తవ్యస్తంగా వచ్చే సీన్స్ ప్రేక్షకుడిని అయోమయానికి గురిచేస్తాయి. మ్యూజిక్ పరంగా సెకండ్ హాఫ్ లో వచ్చే మెలోడీ సాంగ్ బాగుంది.మిగతా పాటలేవి అంతగా అలరించవు. ఫోటో గ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదనిపించాయి.టెక్నికల్ గా కొంచెం రిచ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.రాఘవన్ దర్శకత్వం సినిమా లో ఎక్కడ కూడా ఆహ్లాదంగా ఉండదు.కథకు తగ్గట్టుగా సన్నివేశాలు తీయలేకపోయారనిపించింది.
తీర్పు:
స్టార్ హీరో సూర్య, క్రేజీ డైరెక్టర్ రాఘవన్ మూవీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఒక సాధారణ కార్యకర్త సీఎంగా ఎదిగాడు అని ప్రేక్షకుడిని నమ్మించాలంటే బలమైన కథనం తప్పకుండా ఉండాలి. సీరియస్ పొలిటికల్ డ్రామాలో సిల్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. ఏదేమైనా నంద గోపాల్ సీఎం అంటే నమ్మలేము.
123telugu.com Rating : 2.5 /5
Reviewed by 123telugu Team