ఇంటర్వ్యూ: ‘కమిటీ కుర్రోళ్లు’ అందరికీ కనెక్ట్ అవుతుంది – నిహారిక

ఇంటర్వ్యూ: ‘కమిటీ కుర్రోళ్లు’ అందరికీ కనెక్ట్ అవుతుంది – నిహారిక

Published on Aug 8, 2024 7:12 PM IST

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆగస్టు 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు యదువంశీ డెరెక్ట్ చేయగా, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించి ఆమె పంచుకున్న కొన్ని విశేషాలు.

* ఈ సినిమా కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు కనిపించాలని అనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకున్న టైంలో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మ్యూజిక్‌తో పాటుగా ఈ కథను నాకు వినిపించారు. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని ఫిక్స్ అయ్యా.

* 12 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథ నడుస్తుంది. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ గారి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

* 11 మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక కారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు.

* టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి గారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

* మా నాన్నకి కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చక పోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా బాగా నచ్చింది.

* మా అన్నా, వదినలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా బాగా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు.

* కమిటీ కుర్రోళ్లు టైటిల్‌ను ముందే ఫిక్స్ చేశారు. నాకు కమిటీ కుర్రోళ్లు అంటే ఏంటో తెలియదు. పండుగలు, పబ్బాలు, గొడవలు ఇలా ఏది ఉన్నా కమిటీ కుర్రాళ్లే ముందుంటారని వంశీ చెప్పారు.

* మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను.

* వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు