సమీక్ష : నిను వీడని నీడను నేనే – కొత్తగా సాగే మిర్రర్ మిస్టరీ

సమీక్ష : నిను వీడని నీడను నేనే – కొత్తగా సాగే మిర్రర్ మిస్టరీ

Published on Jul 13, 2019 3:03 AM IST
NVNN movie review

విడుదల తేదీ : జూలై 12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : సందీప్ కిషన్, అన్యా సింగ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.

దర్శకత్వం : కార్తీక్ రాజు

నిర్మాత‌లు : దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్

సంగీతం : ఎస్.ఎస్. తమన్

సినిమాటోగ్రఫర్ : ప్రమోద్ వర్మ

ఎడిటర్ : చోటా కె. ప్రసాద్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ , వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా నేడు విడుదల ఐయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు విశ్లేషిద్దాం.

కథ:

ఆసక్తికరంగా ఈ చిత్రం కథ 2035సంవత్సరంలో మొదలవుతుంది.ఇద్దరు యువ స్కాలర్స్ అర్జున్ (కార్తీక్ నరేన్) మరియు మాధవి(మాళవిక నైర్) 2013లో హైదరాబాద్ లో జరిగిన ఒక కేసు విషయమై మానసిక వైద్యుడైన మురళి శర్మను కలవడం జరుగుతుంది. దాని ఆధారంగా మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో నడుస్తుంది.

రిషి(సందీప్ కిషన్),దియా(అన్య సింగ్) కొత్తగా పెళ్ళైన జంట. ఆనందంగా సాగుతున్న వారిజీవితంలో హైదరాబాద్ శివారు స్మశానంలో వద్ద వారి కార్ కి ప్రమాదం జరిగిన రోజు నుండి అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ ప్రమాదం జరిగిన మరు దినం రిషి,దివ్యల ముఖాలు అద్దంలో అర్జున్(వెన్నెల కిషోర్)మాధవి లవలే కనిపిస్తుంటాయి.

వారి జీవితాలలో జరుగుతున్న ఈ అసహజ సంఘటల వెనుక అసలు కారణాలు తెలుసుకోవాలని రిషి ఓ మానసిక వైద్యుడు మురళీశర్మను కలువగా అతడు, దియా ను చర్చి ఫాదర్ ని కలవమని సలహా ఇస్తాడు. అలాగే మురళి శర్మ, రిషిని ఓ ఆత్మ వెంటాడుతోందని గుర్తిస్తాడు. చర్చి ఫాదర్ దియా కు 400ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనకు సంబంధం ఉందని గ్రహిస్తాడు. చివరిగా ఈ అసహజ సంఘటనలకు కారణం ఏమిటి,వెన్నెల కిషోర్ ఆత్మ సుందీప్ ని ఎందుకు వెంటాడుతుంది. అర్జున్,మాధవి ల మరణం వెనుక ఎవరున్నారు, అనేది తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

చనిపోయిన ఒక జంట మరొక జంట శరీరాలలో ప్రవేశించడం అనే కొత్త కాన్సెప్ట్ ఈ మూవీ యొక్క ప్రధాన బలంగా చెప్పవచ్చు. చిత్రంలో పోసాని పై వచ్చే హాస్యసన్నివేశాలు, ఆత్మలు వెంటాడడం వంటి సన్నివేశాలతో పాటు, మురళి శర్మ పాత్ర వలన రివీల్ అయ్యే ఆసక్తికర మలుపులతో పాటు, మూవీ పతాక సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి. అలాగే మూవీ ఇంటర్వల్ లో వచ్చే ట్విస్టింగ్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

ఇక సందీప్ కిషన్ నటన చాలా బాగుంది. అలాగే రొమాంటిక్ సన్నివేశాలలో హీరో సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్ అన్య సింగ్ చాలా అందంగా కనిపించారు. పతాక సన్నివేశాలతో పాటు చిత్రంలో కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాలలో సందీప్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అన్య సింగ్ తన పాత్ర పరిధిలో చక్కగా నటించడంతో పాటు, చాలా గ్లామర్ గా కనిపించింది.
మురళి శర్మ పై నడిచే ఆసక్తికర సన్నివేశాలతో పాటు, పోసాని కృష్ణ మురళి హాస్యసన్నివేశాలలో అలరించారు. ఇక కీలక పాత్రలో కనిపించిన వెన్నెల కిషోర్ మరో మారు తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఆసక్తికరమైన సంఘటనలతో ఇంట్రెస్టింగ్ గా సాగిన మొదటి 30నిమిషాల నిడివి తరువాత చిత్రం కొంత పట్టు కోల్పోయింది, ఇంటర్వెల్ ట్విస్ట్ తరువాత చిత్రం మరలా ఊపందుకొంది. ఐతే ఆసాంతం కొన్ని ఆసక్తికర,అనుకోని మలుపులతో ఎంగేజ్ చేయడంలో మాత్రం దర్శకుడు విజయం సాధించారు.

ఇక రెండవ భాగంలో కూడా చివరి పతాక సన్నివేశాలలో వచ్చే ఆసక్తికర మలుపు వరకూ సినిమా కొంచెం నెమ్మదిగానే సాగింది అనిపిస్తుంది. సందీప్ పాత్ర విషయంలో కొన్ని మిస్టరీలు సరిగా రివీల్ కాలేదని అనిపించింది. ఆల్గే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం తగ్గిస్తే మంచిది అన్న భావన కలుగుతుంది.

 

సాంకేతిక విభాగం:

దర్శకుడు కార్తిక్ రాజు ఓ నూతన కథను ఈ చిత్రంలో పరిచయం చేసాడు. ఐతే కీలకమైన మిస్టరీ సన్నివేశాలు తెరపై ఆవిష్కరించడంలో ఆయన పూర్తిగా విజయం సాధించలేదనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో అవసరం లేని హాస్యం జొప్పించి మూవీని నెమ్మదించేలా చేశాడు.

థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. అలాగే పాటల సంగీతం కానీ,చిత్రీకరించిన విధానం బాగుంది. మూవీ చివర్లో వచ్చిన ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంది. పి కే వర్మ సినిమాటోగ్రపీ కూడా బాగుంది. చీకటి నేపథ్యంలో ఇంటీరియర్ లొకేషన్ లో తెరకెక్కిన సన్నివేశాలు రిచ్ గా వచ్చాయి.

ప్రవీణ్ ఎడిటింగ్ పర్వాలేదనిపించిన పోసాని,మురళి శర్మల సన్నివేశాలు కొన్ని కట్ చేస్తే బాగుండు అన్న భావన కలుగుతుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదన్నట్లున్నాయి.

 

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే నిను వీడని నీడను నేను ఆసక్తికరంగా సాగే హారర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.అనుకోని మలుపులతో,ఆసక్తిని రేపే సన్నివేశాలతో సినిమాలో దాదాపు చాలా భాగం ఆకట్టుకొనే విధంగా సాగుతుంది. మూవీలో హారర్ ఎలిమెంట్స్ తక్కువగా,సూపర్ నాచురల్ సన్నివేశాలు ఎక్కువగా ఎంగేజింగ్ గా సాగింది. థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికీ నినువీడని నీడని నేను చిత్రం ఈ వారానికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Click Here For English Review

 

123telugu.com Rating :   3/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు