టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏదైనా పండుగ సీజన్ వచ్చిందంటే సినిమాలు పోటీ పడుతుంటాయి. తెలుగు పరిశ్రమ నుంచే కాకుండా ఇతర సినిమా పరిశ్రమల నుంచి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే గత కొన్ని పండుగ సీజన్లలో ఇదే తరహాలో తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా పండుగ బరిలో నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పోటీ పడ్డాయి.
కానీ, తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన సంక్రాంతి పండుగకు ఈసారి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలు మూడు. ఈ మూడు చిత్రాలు కూడా ముగ్గురు స్టార్ హీరోలకు సంబంధించినవే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో పండుగను మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నారు.
అయితే, ప్రతిసారీ ఏదో ఒక డబ్బింగ్ సినిమా పండుగ సమయంలో రిలీజ్ అయ్యేది. ఈసారి కూడా ఓ తమిళ హీరో సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఏ ఇతర భాషా చిత్రం కూడా సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రావడం లేదు. దీంతో ఈ సంక్రాంతి పండుగ కేవలం మన తెలుగు హీరోలదే.. అంటే.. ఈ సంక్రాంతి పండుగ మనదే..!