విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో సెకెండ్ పార్ట్ ‘మహానాయకుడు’ రేపు విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందుగానే ఈ రోజు ఈ చిత్రం ప్రీమియర్ షో వేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఎన్టీఆర్ (బాలకృష్ణ ) తెలుగు దేశం పార్టీ పెట్టి.. అతి తక్కువ టైంలోనే తన ఇమేజ్ కారణంగా అఖండ విజయం సాధిస్తారు. ప్రజలకు తను ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎన్నో మంచి పనులు చేస్తారు. అయితే ఈ క్రమంలో కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా… ఆ ఆలోచనలకు అప్పటి కేంద్రప్రభుత్వం అండ దొరకడంతో.. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపేస్తారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తిరిగి ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ? ఆ క్రమంలో ఆయన ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నారు ? ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి చంద్రబాబు పాత్ర ఎంత వుంది ? అలాగే భార్య బసవతారకంగారి పాత్ర ఎంత వుంది ? చివరకి ఎన్టీఆర్ నేషనల్ వైజ్ గా గ్రేట్ పొలిటీషియన్ గా ఎలా నిలబడగలిగారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం నందమూరి బాలకృష్ణే. మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ లోని ప్రధానమైన కొన్ని హావభావాలను, బాలయ్య తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను అబ్బుర పరుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక వచ్చే అసెంబ్లీ సన్నివేశాల్లో గానీ, అలాగే బసవతారకంగారి ఆరోగ్యం విషయంలో ఎన్టీఆర్ కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో గానీ బాలయ్య నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను పోషించిన విద్యాబాలన్ అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా బాలయ్య – విద్యాబాలన్ ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా, హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్, అక్కినేని పాత్రలో నటించిన సుమంత్ అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకుంటారు.
అలాగే మరో ప్రధాన పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో నటించిన సచిన్ ఖేడేకర్ కూడా ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా డా.భరత్, ఎన్టీఆర్ బావమరిదిగా వెన్నెల కిశోర్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
తెలుగు సినీ పరిశ్రమను ఏకైక మహారాజులా కొన్ని దశాబ్దాల పాటు తన కను సైగలతోనే ఏలారు ఎన్టీఆర్, అదే విధంగా.. రాజయాలను సైతం శాసించి.. ప్రతి తెలుగు వాడి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అంతటి మహానటుడు, మహానాయకుడు గురించి సినిమా తీసి మెప్పించడం అంటే.. మాములు విషయం కాదు. అయితే క్రిష్ మాత్రం ఈ విషయంలో చాలా వరకు విజయం సాధించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించాడు క్రిష్.
మైనస్ పాయింట్స్ :
మహానటుడు, మహనేత ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ కథతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు క్రిష్, కొన్ని సీన్స్ ను మాత్రం నెమ్మదిగా నడిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.
అయితే సినిమాలో కీలకమైన భాగాన్ని ఎమోషనల్ గా నడిపిన క్రిష్, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా చంద్రబాబు పాత్రకు సంబంధించిన సీన్స్ ను వాస్తవానికి కొంత దూరంగా చూపించిన భావన కలుగుతుంది.
ఇక బయోపిక్ కాబట్టి ఎలాంటి రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు ఎక్స్ పెక్ట్ చెయ్యకూడదు. కానీ కమర్షియల్ అంశాలు మరియు ఓవర్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు.
సాంకేతిక వర్గం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. క్రిష్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అలాగే సాయిమాధవ్ బుర్రా మాటలు బాగానే పేలాయి.
సంగీత దర్శకుడు కీరవాణితన పాటలతోనే కాకుండా, తన నేపథ్య సంగీతంతో కూడా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు.
ఆలగే ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ సంస్థలు ఎన్ బి కె ఫిలిమ్స్ . వారాహి , విబ్రి మీడియా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
ఏకైక మహారాజులా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను మరియు రాజకీయాలను తన కను సైగలతోనే ఏలిన ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు’ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ హృదయానికి తాకుతుంది. మహనేతగా ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి దర్శకుడు క్రిష్ చెప్పాలనుకున్న మెయిన్ కథతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో బాగా ఆకట్టుకుంటాడు. అయితే సినిమాలో కీలకమైన భాగాన్ని ఎమోషనల్ గా నడిపిన క్రిష్, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా చంద్రబాబు పాత్రకు సంబంధించిన సీన్స్ ను వాస్తవానికి కొంత దూరంగా చూపించిన భావన కలుగుతుంది. అలాగే కొన్ని సీన్స్ ను కూడా ఆయన నెమ్మదిగా నడిపించారు. ఐతే బాలయ్య – విద్యాబాలన్ తమ నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఎన్టీఆర్ అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team