చానా పెద్ద కథ స్వామి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్స్ తో దేవర ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘దేవర కథ’ పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ట్రైలర్ చూస్తే.. కథ ఏదో కొంచెం రివీల్ అయినట్టుగా అనిపించింది, ట్రైలర్ ను బట్టి సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు, డబుల్ యాక్షన్ హైలైట్ గా ఉంటుందని క్లారిటీ వచ్చింది. మరోవైపు సముద్రానికి సంబంధించి ఆధిపత్యం మీద జరిగే పోరు, ఎన్టీఆర్ మొదటి పాత్ర ఆ ఆధిపత్యాన్ని ఫినిష్ చేసేసి, ఆ పోరులో తనకు త్యాగం చేస్తే.. రెండో ఎన్టీఆర్ పాత్రతో కథ మళ్లీ స్టార్ట్ అయింది ?, మొదటి పాత్ర టార్గెట్ ను రెండో పాత్ర ఎలా ఫినిష్ చేసింది అనేది మెయిన్ కథగా అర్థమైంది.
ఐతే, ఇంతకీ, బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఏదో చెప్పబోతున్నారు అనే కోణాన్ని ట్రైలర్ లో సస్పెన్స్ గా పెట్టారు. కానీ అసలు ఇది కాదు, కథలో ఎన్టీఆర్ మూడో పాత్ర కూడా ఉంటుందని.. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుందని కొత్తగా టాక్ నడుస్తోంది. కొరటాల శివకి – ఎన్టీఆర్ కి ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్. పైగా, కొరటాల శివ ‘ఆచార్య’ ప్లాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. అలాగే, ‘అరవింద సమేత’ వచ్చిన ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి, ట్రైలర్ లో రివీల్ చేసిన కథా నేపథ్యం కంటే.. సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే దేవరలో ఎన్టీఆర్ మూడో పాత్ర పైనే ఇప్పుడు ఆసక్తి పెరుగుతుంది.
నిజంగానే దేవరలో మూడో పాత్ర ఉందా ?, ఆ పాత్ర పేరే దేవరా ?, ఆ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా నడుస్తోందా ? చూడాలి. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో చూడాలి.