విడుదల తేదీ : మార్చి 22, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.
దర్శకుడు: శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్
సంగీత దర్శకులు: సన్నీ ఎంఆర్
సినిమాటోగ్రాఫర్: రాజ్ తోట
ఎడిటింగ్: విష్ణు వర్షన్ కావూరి
సంబంధిత లింక్స్: ట్రైలర్
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి ఫ్రెండ్స్. ఐతే, లైఫ్ లో సీరియస్ నెస్ లేకుండా తోచింది చేస్తూ.. అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గుర్ని ఎలా మార్చాయి ?, అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు ?, ఇంతకీ, ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దెయ్యం ఎవరు ?, ఆ దెయ్యానికి – క్రిష్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, ఇంతకీ.. ఆ దెయ్యం నాలుగు వందల సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది ?, ఈ మధ్యలో జలజాక్షి(ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
‘ఓం భీమ్ బుష్’ సినిమాలో కామెడీ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో చాలా బాగా అలరించారు. శ్రీ విష్ణు తన బాడీ లాంగ్వేజ్ తో పాటు తన మాడ్యులేషన్ తో కూడా మెప్పించాడు. అలాగే, సినిమాలోని కోర్ ఎమోషన్నికూడా శ్రీ విష్ణు క్లైమాక్స్ లో తన హావభావాలతోనే పలికించాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా బాగానే నటించింది. కాకపోతే ఆమె పాత్రకు పెద్దగా నిడివి లేదు.
ప్రియదర్శికి జోడిగా నటించిన మరో హీరోయిన్ అయేషా ఖాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన ప్రియా వడ్లమాని ఆకట్టుకుంది. మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ బాగా అలరించారు. సెకండ్ హాఫ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చే హారర్ సీన్స్ బాగున్నాయి. సునైనా, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు.. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా సినిమాలో ‘శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ’ల మధ్య వచ్చే పంచ్ లు పేలాయి. ఇక సంపంగి పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే నిధితో ముడి పడిన సీన్స్.. మరియు సంపంగితో పాటు మిగిలిన పాత్రలు.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ బాగా మెప్పించాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి కొన్ని చోట్ల తడబడ్డాడు. స్క్రీన్ ప్లే ఫుల్ ఫన్ తో సాగినా.. కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. అలాగే, సినిమాలో లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు.
నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని మేకర్స్ చెప్పినా.. కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా బెటర్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేసినప్పటికీ.. ఆ ఎంటర్ టైన్మెంట్ ను దర్శకుడు పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయాడు.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
‘ఓం భీమ్ బుష్’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్సెస్, ‘శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ’ల నటన, అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఐతే, కామెడీ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team