ఓటిటి స‌మీక్ష: ‘పరువు’ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్

ఓటిటి స‌మీక్ష: ‘పరువు’ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్

Published on Jun 16, 2024 1:09 AM IST
Paruvu Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నివేదా పేతురాజ్, న‌రేశ్ అగ‌స్త్య‌, నాగ బాబు, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్, సునీల్ కొమ్మిశెట్టి, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, ర‌మోశ్ మోయిన్, బిందు చంద్ర‌మౌళి

దర్శకులు: సిద్ధార్థ్ నాయుడు, రాజ‌శేఖ‌ర్ వ‌డ్ల‌పాటి

నిర్మాతలు : విష్ణు ప్ర‌సాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల‌

సంగీత దర్శకుడు: శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్

సినిమాటోగ్రఫీ: చింత విద్యాసాగ‌ర్

ఎడిటింగ్: విప్లవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

జీ5 లో మ‌రో కొత్త వెబ్ సిరీస్ ‘ప‌రువు’ స్ట్రీమింగ్ కు వ‌చ్చింది. నివేదా పేతురాజ్, న‌రేశ్ అగ‌స్త్య‌, నాగ‌బాబు, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

క‌థ:

గుంటూరుకి చెందిన డాలీ అలియాస్ ప‌ల్ల‌వి(నివేదా పేతురాజ్) అగ్ర కులానికి చెందిన అమ్మాయి. ఆమె వెనుక‌బ‌డిన కులానికి చెందిన సుధీర్(న‌రేశ్ అగ‌స్త్య‌)ను పెళ్లి చేసుకుంటుంది. వారి వివాహం ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం ఉండ‌దు. దీంతో వారిద్ద‌రు హైద‌రాబాద్ లో వేరుకాపురం పెడ‌తారు. ఈ క్ర‌మంలో త‌న అంకుల్ చ‌నిపోయారని తెలుసుకున్న ప‌ల్ల‌వి ఆయ‌న చివ‌రిచూపుల‌కు వెళ్లాల‌ని అనుకుంటుంది. డాలీ బంధువైన చందు అలియాస్ చంద్ర‌శేఖ‌ర్(సునీల్ కొమ్మిశెట్టి) వారిని హైద‌రాబాద్ నుంచి తీసుకెళ్లేందుకు వ‌స్తాడు. అనుకోని విధంగా చందుని సుధీర్ హ‌త్య చేస్తాడు. ఈ హ‌త్య నుంచి త‌ప్పించుకునేందుకు డాలీ, సుధీర్ లు ఎలాంటి ప్లాన్ వేశారు..? ఆ త‌రువాత ఏం జ‌రిగింది..? అనేది మిగ‌తా క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్:

‘ప‌రువు’ వాస్త‌వానికి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా అనిపించినా, ఇందులో చాలా అంశాల‌ను ట‌చ్ చేశారు మేక‌ర్స్. ఇందులో కుల స‌మ‌స్య‌, ప‌రువు హ‌త్య‌, రాజ‌కీయాలు వంటి అంశాల‌ను కూడా చూపెట్టారు. ఇలాంటి క‌థ‌లో పాత్ర‌లు ఎక్కువ‌గా ఉంటే, ప్రేక్ష‌కుల‌కు అయోమ‌యంగా అనిపిస్తుంది. కానీ, ‘ప‌రువు’ వెబ్ సిరీస్ లో నివేదా పేతురాజ్, న‌రేశ్ అగ‌స్త్య‌ల‌తో పాటు అన్ని పాత్ర‌లు ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంటాయి.

నివేదా, న‌రేశ్ లు ఓ క్రైమ్ లో ఇరుక్కోవ‌డంతో అందులో నుండి ఎలా బ‌య‌ట ప‌డాల‌ని చూస్తుంటారు. ప్రీణీత ప‌ట్నాయ‌క్ క‌నిపించ‌కుండా పోయిన త‌న కాబోయే భ‌ర్త కోసం ఎదురుచూస్తుంది. ఎమ్మెల్యేగా నాగ‌బాబు ప‌రువు హ‌త్య నింద‌ను మోస్తూ క‌నిపిస్తారు. ఈ పాత్ర‌ల‌న్నీ త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చేసే ప్ర‌య‌త్నాల‌ను మ‌న‌కు ఈ క‌థ‌లో చూపెట్టారు.

నివేదా పేతురాజ్ త‌న కెరీర్ లోనే బెస్ట్ రోల్ లో క‌నిపించింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆమె న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంది. న‌రేశ్ అగ‌స్త్య కూడా ఎంగేజింగ్ ప‌ర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశాడు. రాజకీయ నేత‌గా నాగబాబు న‌ట‌న బాగుంది. ఇక ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటుంది. మిగ‌తా న‌టీన‌టులు కూడా బాగా చేశారు.

మైన‌స్ పాయింట్స్:

నివేదా పేతురాజ్, న‌రేశ్ అగ‌స్త్య‌ల ఇంట్రో ఉన్న తొలి ఎపిసోడ్ ను ఇంకాస్త బెట‌ర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. ప‌రువు వెబ్ సిరీస్ కు క‌నెక్ట్ అయ్యేందుకు ప్రేక్ష‌కుల‌కు కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఈ సిరీస్ ర‌న్ టైమ్ కాస్త త‌గ్గించాల్సి ఉండేది.

ఇందులోని కొన్ని డైలాగులు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇబ్బందిక‌రంగా ఉంటాయి. ఇందులోని నెగెటివ్ పాత్ర‌లు ఆ డైలాగులు చెప్పాల్సి ఉంటుంద‌ని మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చినా, ఓ వ‌ర్గానికి చెందిన‌ ఆడియెన్స్ వాటిని స్కిప్ చేస్తారు.

సాంకేతిక విభాగం:

శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ చూపెట్టింది. చింత విద్యాసాగ‌ర్ విజువ‌ల్స్ ఆక‌ట్టుకున్నాయి. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ వ‌ర్క్ ఇంకాస్త బెట‌ర్ గా ఉండాల్సింది. ద‌ర్శ‌కులు ఈ సిరీస్ ను మ‌లిచిన తీరు బాగుంది. సెకండ్ ఇన్ స్టాల్మెంట్ కు సంబంధించిన క్లూ కూడా చ‌క్క‌గా ప్రెజెంట్ చేశారు.

తీర్పు:
మొత్తంగా ‘ప‌రువు’ వెబ్ సిరీస్ లోని వివిధ‌ అంశాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇందులోని స‌బ్-ప్లాట్స్, వాటిని క‌లిపే పాయింట్లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. మంచి రైటింగ్ తో పాటు నివేదా, న‌రేశ్ అగ‌స్త్య, నాగ‌బాబు, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ ల టెర్రిఫిక్ ప‌ర్ఫార్మెన్సులు ఈ సిరీస్ కు బ‌లంగా నిలిచాయి. ఈ సిరిస్ లో లీనం కావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టినా, ఒక్క‌సారి క‌థ‌లోకి వెళ్తే ఇది చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు