‘పుష్ప 2’ సినిమాని చూడటానికి వచ్చి, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అవ్వడం మొత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే, ఈ విషయం పై కొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కూడా తాజాగా ఈ విషయం పై స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడుతూ.. ‘గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ అసలేం మాట్లాడారంటే.. ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు. కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్‌షోలకు అవకాశమిచ్చి, టికెట్ ధర పెంపునకూ వెసులుబాటు కల్పించడం వల్లే ‘సలార్’, ‘పుష్ప’వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించే వారు ఆలోచిస్తారు. ‘అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంది. సినిమా అంటే టీమ్.. అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో మాత్రమే రేవంత్ రెడ్డి స్పందించారు’ అని పవన్ తెలిపారు.