గ్రాండ్‌గా లాంచ్ అయిన ‘పెన్ డ్రైవ్’ మూవీ

గ్రాండ్‌గా లాంచ్ అయిన ‘పెన్ డ్రైవ్’ మూవీ

Published on Oct 12, 2024 10:45 AM IST


శ్రీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో విష్ణు వంశీ, రియా కపూర్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా “పెన్ డ్రైవ్”. కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ నివ్వగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత కె.రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిన్ననే కథ వినడం జరిగింది, చాలా బాగుంది. నా పాత్ర కూడా చాలా బాగా రాశారు. పేరు కూడా నాకు చాలా నచ్చింది. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్‌లకు, నటించే మిగతా నటి నటులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

హీరో విష్ణు వంశీ మాట్లాడుతూ.. ‘దర్శకుడు ఎంఆర్ దీపక్ గారు చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. పెన్ డ్రైవ్ లాంటి మంచి మూవీలో హీరోగా నటించడం సంతోషంగా ఉంది. నేను లా చేశాను. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. పెన్ డ్రైవ్ మూవీతో హీరోగా నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా.’ అని అన్నారు.

నటుడు ఆజాద్ మాట్లాడుతూ.. ‘పెన్ డ్రైవ్ మూవీలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్‌లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగుంటుంది. మీ అందరి సపోర్ట్ దక్కాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నిర్మాత కె రామకృష్ణ మాట్లాడుతూ..‘మా బ్యానర్‌లో పెన్ డ్రైవ్ మూవీని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మా మూవీ ఓపెనింగ్ కు వచ్చిన గెస్ట్ లకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మా బ్యానర్ లో మరిన్ని మంచి మూవీస్ నిర్మించాలని కోరుకుంటున్నాం.’ అని అన్నారు.

దర్శకుడు ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ మనకు ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ కొందరు దుర్వినియోగం చేస్తూ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టం. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలనే మంచి సందేశాన్ని మా పెన్ డ్రైవ్ చిత్రంలో చెబుతున్నాం. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఉచితంగా వచ్చే దేనికీ ఆశపడకూడదు. అలా ఆశపడితే ఇబ్బందులు పడతారనే అంశాన్ని చూపిస్తున్నాం. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తాం. మా చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు