నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు.
హైదరాబాద్లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించి, దానితోపాటు ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్ను ఏర్పాటు చేస్తామని.. ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని.. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని వారు కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు.
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొన్న సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.