‘మా’ను ఓ ఛారిటీ అసోసియేషన్‌గా మార్చేశారు – ప్రకాశ్ రాజ్

Published on Sep 15, 2021 1:32 am IST


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్ ప్యానల్ ఎన్నికల క్యాంపెన్ వేగంలో ముందుంది. తాజాగా సినీ‘మా’బిడ్డలం పేరుతో తన ప్యానెల్‌ సభ్యులు, ఆయనకు మద్దతు తెలిపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ రెండేళ్ల క్రితమే మా ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నానని, కానీ కారణాల వలన మౌనంగా ఉండాల్సొచ్చిందని, ఇక మౌనంగా ఉండకూడదని అనిపించి పోటీకి వచ్చానని అన్నారు.

అయితే ‘మా’ను ఓ ఛారిటీ అసోసియేషన్‌గా మార్చేశారని, ‘మా’ అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం, పరిస్థితి బాలేదంటే పదివేలు ఇవ్వడం, రేషన్‌ ఇవ్వడం కాదని ఆర్టిస్టులను బలపరిచేలా, ఎదగనిచ్చే అసోసియేషన్‌లా ‘మా’ అనేది ఉండాలని అన్నారు.

‘మా’ అసోషియేషన్‌లో మొత్తం 900 మంది సభ్యులున్నారని, ఇందులో సుమారుగా 150 మంది యాక్టివ్‌ మెంబర్స్ కాదని, మరో 147 మంది స్థానికులు కాదని, ఉన్న 600 మందిలో ఓ 150 మంది పెద్ద పెద్ద నటులు ఉన్నారని వారు ఓటింగ్‌కి రారని వారికి ప్రస్తుతం ఎలాంటి సాయం అవసరం లేదని, మిగిలిన 450 మందిలో 200 మంది బాగానే ఉన్నారని, ఇక మిగిలింది కేవలం 250 మంది మాత్రమే అని, ఇందులో 40 మంది రంగస్థలానికి సంబంధించిన వారు ఉన్నారని, ఈ 250 మందిని ఆదుకోలేమా అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆరు నెలల పాటు ఈ హోం వర్క్‌ చేసుకుని వచ్చానని, మంచి చేయాలనుకుని అందరికి ఉంటుందని కానీ ఎలా చేయాలో తెలియడం లేదని అందుకే తాను మార్పు కోరుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :