విడుదల తేదీ : మార్చి 29, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : రాజేష్ కుమార్, ప్రజ్వాల్, ధనరాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్ తదితరులు
దర్శకత్వం : ఈశ్వర్
నిర్మాత : టి.నరేష్, టి.శ్రీధర్.
సంగీతం : జై.యం
సినిమాటోగ్రఫర్ : చక్రి
ఎడిటర్ : శ్రీనివాస్ కంబాల
రాజేష్ కుమార్, ప్రజ్వాల్ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేష్, టి.శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
కార్తీక్ (రాజేష్ కుమార్) చిన్నప్పటి నుంచీ ప్రేమ (ప్రజ్వాల్)ను చాలా సీరియస్ గా లవ్ చేస్తుంటాడు. ప్రేమే తన భార్య అని మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అయితే అది కార్తీక్ తండ్రికి అస్సలు నచ్చదు. దాంతో చిన్నప్పుడే కార్తీక్ ను ఇంట్లో నుంచి పంపించేసి.. హాస్టల్ లో జాయిన్ చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రేమను తానే మహారాణిలా చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తాడు. ప్రేమ కోసం చివరికి కొడుకును కూడా దూరం చేసుకుంటాడు కార్తీక్ తండ్రి.
కాగా కార్తీక్ మాత్రం తండ్రికి తెలియకుండా ప్రేమ వెంట పడుతూ ప్రేమించమని బతిమిలాడుతుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ప్రేమ కార్తీక్ ను ప్రేమించినా, అతన్ని దూరం పెట్టాలని చూస్తోంది. లవ్ చేస్తున్నప్పటికీ కార్తీక్ ను ఎందుకు దూరం పెట్టాలనుకుంది ? అసలు ‘కార్తీక్ తండ్రి’ కొడుకును కూడా కాదనుకోని ప్రేమను ఎందుకు పెంచి పెద్ద చేస్తాడు ? ఈ క్రమంలో చివరకు ప్రేమ – కార్తీక్ ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో హీరోగా నటించిన రాజేష్ కుమార్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. డాన్స్, డైలాగ్ మాడ్యులేషన్ తో సహా రాజేష్ కుమార్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రజ్వాల్ తన గ్లామర్ తోనే కాకుండా.. తన లుక్స్ పరంగా, అలాగే తన నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది.
ఇక కమెడియన్స్ ధనరాజ్, రాంప్రసాద్ తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గోవాలో బీచ్ సన్నివేశంలో ధనరాజ్ తన మ్యానరిజమ్స్ తో నవ్విస్తాడు. ఇక హీరోకి తండ్రిగా నటించిన నటుడు కూడా చాలా బాగా నటించాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్:
ప్రేమకు మరియు నమ్మకానికి సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ఈశ్వర్, ఆ కాన్సెప్ట్ ను అంతే బాగా తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ను కథకు అవసరం లేని సీన్లతో అనవసరమైన సాంగ్ లతో నడిపితేే, సెకెండ్ హాఫ్ ను సాగతీత సన్నివేశాలతో, పండిన ఎమోషనల్ సన్నివేశాలతో సాగ తీస్తూ సినిమాను ముగించాడు.
ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రేమ కథకు సంబంధించిన సన్నివేశాలు కూడా, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించవు. ముఖ్యంగా కథలోని మెయిన్ సంఘర్షణ బలంగా లేకపోవడం , పైగా పాత్రల మధ్య నడిచే డ్రామా కూడా బోర్ గా సాగడంతో.. సినిమా ఫలితం దెబ్బ తింది. ఇక హీరోయిన్ క్యారెక్టైజేషన్ కూడా మరీ బలహీనంగా ఉంది. దాంతో ప్రేమలో సీరియస్ నెస్ బాగా మిస్ అయింది. దర్శకుడు స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ఈశ్వర్ ప్రేమకు మరియు నమ్మకానికి సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికి.. దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. చక్రి కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ బాగున్నాయి.
జై.యం అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కాకపోతే పాటల్లో చాలా చోట్ల పాత చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఇక ఎడిటర్ శ్రీనివాస్ కంబాల పనితనం పర్వాలేదు. నిర్మాతలు టి.నరేష్, టి.శ్రీధర్ చిత్రం పై బాగానే ఖర్చు పెట్టారు.
తీర్పు :
రాజేష్ కుమార్, ప్రజ్వాల్ జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అయితే సినమాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. హీరో రాజేష్ కుమార్ నటన కూడా బాగానే ఉంది.
కానీ ఆకట్టుకోని కథనం, మెప్పించలేకపోయిన దర్శకత్వ పనితనం, ఆసక్తిగా సాగని కొన్ని ప్రేమ సన్నివేశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ చిత్రం లవర్స్ కు పర్వాలేదనిపిస్తోంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
123telugu.com Rating :2.25/5
Reviewed by 123telugu Team