తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా చెప్పబడుతోన్న ‘పులి’ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇలయదళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ 100 కోట్ల బడ్జెట్ సినిమా అక్టోబర్ 1న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సినిమా విడుదలకు ఇంకా కొద్దిరోజుల సమయమే ఉండడంతో సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ చివరిదశకు చేర్చేసింది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.
ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులన్నీ పూర్తైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ వారం కల్లా ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, ఆ వెంటనే సినిమాను సెన్సార్‌కు పంపించేందుకు ‘పులి’ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా, విజయ్ కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాగా ప్రచారం పొందుతోంది. తెలుగులో ఈ సినిమాను ఎస్వీఆర్ మీడియా డబ్ చేస్తోంది. విజయ్ సరసన శృతి హాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే!