యాదాద్రి : ఆగష్టు : 10
అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న యాదాద్రి పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రితో ఘనంగా ముగిసాయి. మూలమంత్ర అనుష్టాన జపంతో పాటు , పూర్ణాహుతి, ఎనిమిది పట్టు నూలుపోగుల పవిత్రమాలల అలంకరణ , దివ్యవిమాన ప్రదక్షిణ, సుదర్శన నారసింహ హోమం వంటి క్రతువులు ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు పర్యవేక్షణలో పరమ పవిత్రంగా జరిగాయి.
చివరి రోజయిన మంగళవారం లక్ష్మీనృసింహ భగవానుల ఉత్సవమూర్తులతో కూడిన పవిత్రమాలల మాడ వీధుల ఊరేగిపులో అనుకోని అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ … శ్రావణ సౌభాగ్యవేళ వేదవిదుల మంత్రవిద్యల హోమక్రతువుల మధ్య శ్రీసమృద్ధంగా సాగుతున్న ఈ మహా ఉత్సవంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పడం విశేషం.
ఈ సందర్భంలో గర్భగుడి బయటి ప్రాగణంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కు, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కి ప్రధాన అర్చకులు పవిత్రమాలలను మెడలోవేసి ఘనంగా ఆశీర్వదించారు.
ఈ శ్రీకార్యంలో మాడవీధుల ఊరేగింపులో యాదాద్రి దేవస్థాన జాయింట్ కమీషనర్ శ్రీమతి గీతారెడ్డి , వంశపారంపర్య ధర్మకర్త బి. నరసింహమూర్తి , వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ , తెలంగాణా ప్రభుత్వ విప్ ప్రభాకర రావు, తెలంగాణా రాష్ట్ర పురుత్పాదకసంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ శిల్పసౌందర్యాన్ని ఆలయ స్థపతి దగ్గరుండి పురాణపండ శ్రీనివాస్ మరియు సాయి కొర్రపాటి కి దగ్గరుండి చూపించారు.
వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నాలుగు సంవత్సరాల క్రితం యాదాద్రి లక్ష్మీ నారసింహుడికి మకరతోరణ దివ్య అలంకరణ కోసం ఇరవై ఐదులక్షల రూపాయల బంగారం అందించిన విషయం ఈ సందర్భంగా ఆలయ అధికారులకు , పురాణపండ శ్రీనివాస్ కు జాయింట్ కమీషనర్ గీతారెడ్డి వివరించారు.