యాదగిరిగుట్ట : ఆగస్ట్ : 2
మానవజాతికి సంస్కార సార్ధకాలను కలుగజేసేవి ఆలయదర్శనాలు , ప్రార్ధనా చైతన్యాలు మాత్రమేనని అడుగడుగునా నిరూపిస్తూ …. కవిత్వ సాహిత్య ఆధ్యాత్మికతలతో ప్రయాణించే ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ఈ ఉదయం మహా శ్రీ వైష్ణవక్షేత్రం యాదాద్రిని దర్శించుకుని పులకించిపోయారు. కృష్ణ శిలల సౌందర్యంతో, మంగళ వాద్యఘోషలతో , శ్రవణ సుఖమైన వేదగానాలతో మంగళ శోభితమైన యాదాద్రిని దర్శించుకోవడానికి విచ్చేసిన పురాణపండ శ్రీనివాస్ కి ఆలయ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లంధీగళ్ లక్ష్మీ నరసింహాచార్యలు వైదిక మర్యాలతో స్వాగతం పలికారు.
పవిత్ర పరిమళభరితమైన గర్భాలయ ముఖద్వారం వద్దకు శ్రీనివాస్ ను ప్రత్యేకంగా తోడ్కొని వెళ్లి శ్రీ లక్ష్మీ నారసింహుల మూలమూర్తుల దర్శనం చేయించారు. మూల మూర్తుల అద్భుత దర్శన సమయంలో శ్రీనివాస్ పరమ భక్తి భావంతో కొంత ఉద్విగ్నతకు లోనయ్యారు. తెలంగాణాకు యాదాద్రి మహాక్షేత్రం ఒక జయజయధ్వానమని ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ ప్రత్యేకమైన రీతిలో కవిత్వ ఆధ్యాత్మిక స్పర్శలతో చెప్పడం అక్కడున్న పండిత , అధికార వర్గాలను ఆకర్షించింది.
ధర్మనిష్ఠ కారణంగానే శ్రీవిద్యాసమృద్ధంగా సనాతన ధర్మాలతో యాదాద్రి మహాక్షేత్రం శోభిల్లుతోందని , ఈ ఆలయ సౌందర్యం వెనుక ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మహాసంకల్పం చరిత్రకెక్కిందని శ్రీనివాస్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు. యాదాద్రి దేవస్థానం తలపెట్టిన శ్రావణ మహాలక్ష్మికి కోటికుంకుమార్చన సన్నిధానాన్ని ఈ సందర్భంగా పురాణపండ ప్రధానార్చకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో , పూలమాలతో వైదిక లాంఛనాలతో శ్రీనివాస్ కు ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా కోటికుంకుమార్చన ప్రాంగణంలో వేదగానం చేస్తున్న సుమారు ఇరవై ఐదుమంది వేదవిదులకు శ్రీనివాస్ ‘ శ్రీపూర్ణిమ” ధార్మిక మహాగ్రంధాన్ని బహూకరించి అభివాదాలు సమర్పించారు. జీవితంలో అడుగడుగునా సవాళ్లెదుర్కొన్న శ్రీనివాస్ కు తెలంగాణా, ఆంధ్రాప్రాంతాలలోని ఆలయాలలో, ధార్మిక సంస్థలలో ఫాలోయింగ్ చాలా ఎక్కువనేది ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. ఎంతో దయార్ద్ర హృదయంతో సంచరించే శ్రీనివాస్ కు వేంకటేశ్వరుడన్నా, నారసింహుడన్నా, పరమేశ్వరుడన్నా చాలా చాలా ఇష్టమని సన్నిహితులు చెబుతుంటారు కూడా.
శ్రీశైలం నుండి సింహాచలం వరకు, తిరుమల నుండి యాదాద్రి వరకూ శ్రీనివాస్ ని ఎంతోమంది అర్చక ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు , వేదపండితులు అభిమానిస్తూంటారు. ప్రతిభాసంపదతోపాటు నిస్వార్ధంగా వుండే ఆయన జీవనం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఆయన బుక్స్ లో అడుగడుగునా అందమైన భాష పాఠకుణ్ణి యిట్టె ఆకర్షించడం ఒక ప్రత్యేకతే. యాదాద్రి దర్శనం ఒక పవిత్ర మానసిక సౌందర్యమన్నారు శ్రీనివాస్. ఒక ధైర్యభావన అన్నారు శ్రీనివాస్. జీవనవైభవంలో ఒక అపురూపమన్నారు శ్రీనివాస్.