ఇక్కడ యుద్ధం అనివార్యం – పూరి జగన్నాథ్‌

ఇక్కడ యుద్ధం అనివార్యం – పూరి జగన్నాథ్‌

Published on Dec 23, 2024 12:05 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ రోజు మరో సరికొత్త టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘ఎండ్ లెస్ బాటిల్’. మరి పూరి మాటల్లోనే ‘ఎండ్ లెస్ బాటిల్’ గురించి విందాం. పూరి మాటల్లో.. ‘అనంత మహాసంద్రం.. అరుస్తున్న కెరటాలు.. అదుపుతప్పిన గాలులు.. అలలపై కలల మధ్య గుంపులుగా జనం. ఎలాగూ పోతాం.. తప్పించుకునే దారేలేదు. అందుకే పోయే ముందు బతుకుదాం. అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అర్థం పరమార్థం తేల్చేద్దాం. ఇంకా నడి మధ్యనే ఉన్నాం. ఇంకెంత దూరమో ఈ ప్రయాణం. గత ప్రయాణం అదొక కథ. రేపటి ప్రయాణం మరొక కథ. పిట్ట కథలు మనకెందుకు ?, ఇప్పుడే ఇక్కడే బతికేద్దాం. మళ్లీ మబ్బులు.. చంపుకొని తినే చినుకులు. ఇది వానో పెను తుపానో! పడవలోకి నీరొస్తే.. పరదా చిరిగిపోతే.. జడిసేదే లే. వలలో ఒక్క చేపా చిక్కలే.. అయితేనేం ? పస్తులుందాం.. ఫర్వాలేదు. ఇవాళ ఆకలితో కడుపు మాడితే.. రేపటి వేట తీరు వేరేలా ఉంటుంది.

సొర చేపలు చిక్కకపోతాయా? ఏదీ నేర్వకుండా ఏ రోజూ ఉండకు. ఎండకుండా.. వేటాడకుండా నిద్రలోకి జారుకోకు. ఏంటో ఎగిరెగిరి పడుతోంది పడవ. చలిగాలి ఒక పక్క.. చల్లటి జల్లు మరో పక్క. తడిసిన ఒళ్లు.. పెదాలపై ఉప్పు నీళ్లు. ఒళ్లంతా వణుకు.. కళ్లల్లో బెణుకు. ఎముకల్లో నిస్సత్తువ. అయినా నా అన్న వారిని వదులుకోకు. సాయం చేసిన చేతిని మరవకు. పిడుగొచ్చి మీద పడినా కెరటం ఢీ కొట్టినా ఆ చేయిని వదలకు. పడినా విడవకు. తమ్ముడా.. ఇక్కడ అందరిది ఒకే పడవలో ప్రయాణం. అదిగో పొగరెక్కిన తరంగం. ఉప్పొంగిన హిమాలయం. ప్రతి కెరటం.. ముంచాలనే, ఆదమరిస్తే చంపాలనే. ఆపకు తమ్ముడూ తెడ్డు వేయడం మానకు. ఎదురెళ్లి ఎక్కేసి దూకేయ్. ఈ అనంత కడలిలో మనమెంత? పడవెంత? ఇసుకెంత? అయినా.. సంద్రాన్ని చీల్చుకుంటూ పోదాం. కొడవళ్లై కోసుకుంటూ పోదాం.

సంద్రం లోతెంతో ఎవరికి కావాలి ?, ఆ నింగీ నేల కలిసేది ఎక్కడో చూడు. తీరం కానరావట్లేదని కలవర పడకు. ప్రతి సంద్రం ఏదో ఒక తీరాన్ని ఆనుకునే ఉంటుంది. తీరం రావాల్సిందే, భారం తీరాల్సిందే. వెర్రెక్కిన కెరటాలు సముద్రపు దొంగలు, పిశాచాలు. రా.. ఎదురెళదాం, కలపడదాం. అడ్డొస్తే తోసేద్దాం, ఆపితే వేసేద్దాం. తోసుకుంటూ తొక్కుకుంటూ పోదాం. ఇది కరుణలేని సాగరం. కారుణ్య రహిత రణరంగం. అమ్మ వద్దన్నా, దేవుడే అడ్డొచ్చినా పులులై దూకేద్దాం, సింహాలై గర్జిద్దాం. ఇది అనంత యుద్ధ సంగ్రామం. అందరితో యుద్ధం చేస్తే అలెగ్జాండర్‌. తనతో తానే తలపడితే గౌతమ బుద్ధ సిద్ధార్థ. తలలు నరుకుతావో తలే నరుక్కుంటావో! తమ్ముడా.. ఇక్కడ యుద్ధం అనివార్యం’’ అంటూ పూరి జగన్నాధ్ ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు