పూరీ జగన్నాథ్ మంచి రచయిత అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డైలాగుల్లో ఎంత గాఢత ఉంటుందో, ఆయన కథల్లోనూ అంతటి బలముంటుంది. ‘టెంపర్’ ముందు వరకూ తన కథలనే సినిమాలుగా తెరకెక్కించిన పూరీ.. ‘టెంపర్’ సినిమాతో కొంత పంథాకు దారిని ఏర్పరచాడు. ప్రముఖ తెలుగు సినీ కథా రచయిత వక్కంతం వంశీ అందించిన కథను ‘టెంపర్’ సినిమాగా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు పూరీ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ‘జ్యోతిలక్ష్మి’ కూడా తన కథ కాకపోవడం విశేషం.
చార్మీ హీరోయిన్‌గా, పూరీ తెరకెక్కిస్తున్న డిఫరెంట్ సినిమాయే జ్యోతిలక్ష్మి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీ, ‘జ్యోతిలక్ష్మి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన సూపర్ హిట్ నవల మిసెస్ పరాంకుశం కథే జ్యోతిలక్ష్మి సినిమాకు ప్రేరణ అని పూరీ తెలిపారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచే ఈ కథపై విపరీతమైన ఆసక్తి కనబరిచానని, ఇప్పటికి ఆ కథ సినిమాగా రూపొందుతోందని పూరీ అన్నారు. ఇక గతంలో మల్లాది రాసిన కొన్ని నవలలు సినిమాలుగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
తన గత చిత్రం ‘టెంపర్’కు వేరొకరి కథను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్, ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు జ్యోతిలక్ష్మి విషయంలోనూ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ రెండో వారంలో విడుదల కానుంది.