సమీక్ష : రహస్యం – ఆసక్తికరంగా సాగని హర్రర్ డ్రామా

సమీక్ష : రహస్యం – ఆసక్తికరంగా సాగని హర్రర్ డ్రామా

Published on Feb 1, 2019 6:37 PM IST
Rahasyam movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 01, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : శైలేష్ , శ్రీ రితిక, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు త‌దిత‌రులు.

దర్శకత్వం : సాగర్ శైలేష్

నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ.

సంగీతం : కబీర్ రఫీ

సాగర్ శైలేష్ దర్శకత్వంలొ భీమవరం టాకీస్ పతాకం పై శైలేష్ , శ్రీ రితిక జంటగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తొన్న చిత్రం రహస్యం. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

రవి (శైలేష్) సినిమా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రే చేస్తుంటాడు. ఈ క్రమంలో రవి తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అయిన ప్రొడ్యూసర్ (తుమ్మలపల్లి రామసత్యనారాయణ) ఓ మంచి హర్రర్ కామెడీ స్క్రిప్ట్ రాసుకొని వస్తే.. రవికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానంటాడు. అయితే హర్రర్ స్టోరీ రాయాలంటే దెయ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే బెటర్ అని రవి అండ్ అతని ఫ్రెండ్స్ (సినిమాలో మిగిలిన ఆర్టిస్ట్ లు) ఓ మాంత్రికుడు (జబర్దస్త్ ఫేమ్ అప్పారావు) దగ్గరికి వెళ్తారు. అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాల మధ్య దివ్య (దెయ్యం) రవి వెంట పడుతుంది. తియ్యబోయే సినిమాలో తననే హీరోయిన్ గా పెట్టి తీసేదాకా నిన్ను వదలను అని రవి చుట్టే తిరుగుతూ ఉంటుంది.

ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల అనంతరం రవి దెయ్యాన్ని (దివ్య) పెట్టి సినిమా తీస్తాడు. ఇంతకీ దివ్య ఎవరు ? ఆమె ఎలా చనిపోయింది ? రవి చుట్టే ఎందుకు తిరుగుతుంది ? అసలు రవి తీసే సినిమాలోనే ఆమె ఎందుకు నటించాలనుకుంది ? అసలు ఆమె కోరిక ఏమిటి ? ఆ కోరిక కారణంగా రవి జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సినిమా పేరులోనే రహస్యం ఉన్నట్లు.. ఈ సినిమా కథలో కూడా హీరో పాత్రకు తప్ప మిగిలిన పాత్రలకు ఏం జరుగుతుందో రహస్యంగానే ఉంటుంది. సినిమాలో కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా మంచి ఎమోషనల్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సాగర్ శైలేష్ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని సాగర్ శైలేష్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన శ్రీ రితిక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ పాత్రలో ఒదిగిపోయారు. తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించారు. వీళ్ళకి హీరోయిన్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తాయి. దర్శకుడు సాగర్ శైలేష్ తీసుకున్న స్టోరీ పాయింట్ బాగానే ఉంది. ఆయన రాసుకున్న కొన్ని హర్రర్ సన్నివేశాలు కూడా ఓకే అనిపిస్తాయి. అలాగే మెయిన్ గా.. హీరో హీరోయిన్ల వచ్చే హర్రర్ సీన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు క సాగర్ శైలేష్ రాసుకున్న కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. కథ కథనాల్లో మాత్రం ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది.

దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది.

కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలతో ఓ దెయ్యం కోరిక నెరవేర్చే క్రమంలో హీరో ఏం అయిపోతాడో ఎలాంటి ఇబ్బందులకు గురవుతాడో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ను పూర్తిగా వాడుకోలేదు. కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన సెకండాఫ్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు కబీర్ రఫీ అందించిన నేపధ్య సంగిగం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ లవ్ స్టోరీకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుంది.
ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సుధాకర్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. హర్రర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

సాగర్ శైలేష్ దర్శకత్వంలొ భీమవరం టాకీస్ పతాకం పై శైలేష్ , శ్రీ రితిక జంటగా వచ్చిన ఈ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకునే విధంగా సాగలేదు. కానీ సాగర్ శైలేష్ హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. సాగర్ శైలేష్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే దర్శకుడుగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

సాగర్ శైలేష్ రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కథలో ముఖ్యమైన కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదనిపించిన్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాని మాత్రం ఆయన ఆసక్తికరంగా మలచలేకపోయారు. సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలతో విసుగు తెప్పిస్తారు. మొత్తం మీద ఈ ‘రహస్యం’ చిత్రం నిరాశ పరిచింది.

 

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు