హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సరసన జంటగా రకుల్ ప్రీత్ సింగ్ ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది. అయితే, ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ప్రభాస్ చేసిన ఓ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకోవడం పై రకుల్ స్పందించింది. ఇంతకీ, ఆమె ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం. ‘ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నాను. దీంతో, షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్ కోసం ఎన్నిరోజులైనా ఫోన్ రాలేదు’ అని రకుల్ చెప్పింది.
ఇదే విషయం గురించి రకుల్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ తర్వాత కొన్ని రోజులకు నా స్థానంలో కాజల్ ను తీసుకున్నట్లు నాకు తెలిసింది. నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆ సినిమా నుంచి నన్ను తొలగించడం నన్ను బాధించింది. కానీ, అప్పటికే ప్రభాస్- కాజల్‌ల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో, మరోసారి ఆ జోడి రిపీట్ అయితే బాగుంటుందని చిత్రబృందం నన్ను తొలగించింది. సినిమా అనేది ఓ వ్యాపారం కాబట్టి ఇది సహజమే. ఐతే, మనకు ఒక అవకాశం పోయినా.. దానికి మించింది మనకు వస్తోంది’ అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.