సమీక్ష : “జైలర్” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ డ్రామా !

Jailer Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు మరియు తదితరులు

దర్శకుడు : నెల్సన్ దిలీప్ కుమార్

నిర్మాతలు: కాలనీతి మారన్

సంగీతం: అనిరుద్ రవిచంద్రన్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: ఆర్.నిర్మల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “జైలర్”. కాగా ఈ చిత్రం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

ముత్తు వెల్ పాండియన్ (రజినీకాంత్ ) గతంలో స్ట్రిక్ట్ జైలర్ అయినప్పటికీ.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. తన మనవడితో ముత్తు సరదాగా ఉంటాడు. అయితే, పోలీస్ అధికారి అయిన ‘ముత్తు కొడుకు’ ఏసిపి ని చంపేస్తారు. కొడుకు చావుకి ప్రతీకారంగా ముత్తు హత్యలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముత్తు ఫ్యామిలీకి ఆపద వస్తోంది. తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ముత్తు వెల్ పాండియన్ ఏం చేశాడు ?, తన కుటుంబాన్ని చంపాలని ప్రయత్నిస్తున్న వారి పై ముత్తు ఎలా ఎటాక్ చేశాడు ?, చివరకు ముత్తు తాను అనుకున్నది సాధించాడా ?, లేదా ?, ఇంతకీ ముత్తు కొడుకు నిజ స్వరూపం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

జైలర్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూతలూగించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రజినీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజినీకాంత్ చాలా బాగా నటించాడు. అతిధి పాత్రల్లో నటించిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు.

మరో కీలక పాత్రలో నటించిన సునీల్ కూడా చాలా బాగా నటించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. తమన్నా స్పెషల్ సాంగ్ బాగుంది. వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

జైలర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా జైలర్ కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఈ జైలర్ లో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గత తన సినిమాల శైలిలోనే నెల్సన్ ఈ సినిమాని కూడా నడిపారు. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు.

ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో నెల్సన్ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన రజినీ కొడుకు పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది.

ఓవరాల్ గా ఈ జైలర్ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు. రజినీకాంత్ ఫాన్స్ కూడా సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తికి గురి అవుతారు.

 

సాంకేతిక విభాగం :

 

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యారు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని కాలనీతి మారన్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

జైలర్ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ నటన, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. అలాగే రెగ్యులర్ ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ కారణంగా సినిమా ఫలితం దెబ్బతింది. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version