‘ఆచార్య’ పట్ల రామ్ చరణ్ బాధ్యతలు పూర్తయ్యాయి

Published on Mar 6, 2021 1:00 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’తో తన కోరికను తీర్చుకున్నారు. ఎన్నాళ్లగానో తండ్రితో కలిసి సినిమా చేయాలని అనుకునేవారు ఆయన. మంచి స్టోరీ దొరికితే చేస్తానని పలుసార్లు బహిరంగంగానే అనేవారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆ కోరికను తీర్చారు. తండ్రీకొడుకులను ఒకేసారి మోయగల కథను సిద్ధం చేసి ‘ఆచార్య’ను పట్టాలెక్కించారు. చిరు, చరణ్ ఇద్దరూ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. కథను, దర్శకుడిని బలంగా నమ్మి ఆడుతూ పాడుతూ కలిసి పనిచేసేశారు.

రామ్ చరణ్ అయితే అవతల రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నా కూడ జక్కన్నను ఒప్పించి మరీ ‘ఆచార్య’ కోసం డేట్లు కేటాయించారు. ఏకధాటిగా 20 రోజుల పాటు షెడ్యూల్ చేశారు. మారేడుమిల్లి అడవుల్లో అల్లు అర్జున్, సుకుమార్ చిత్రం ‘పుష్ప’ కోసం వేసిన సెట్లో షూటింగ్ చేశారు. నేటితో ఆ షెడ్యూల్ ముగిసింది. దీంతో చరణ్ హైదరాబాద్ తిరిగివచ్చేశారు. మొత్తానికి చరణ్ ‘ఆచార్య’ పట్ల తన షూటింగ్ బాధ్యతలను నెరవేర్చేశారు. మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ కంపోజర్ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :