విడుదల తేదీ : జనవరి 10, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : రామ్ చరణ్, అంజలి, కియార అద్వానీ, ఎస్ జె సూర్య, జైరాం, శ్రీకాంత్, సముద్రకని, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకుడు : ఎస్. శంకర్
నిర్మాత : దిల్ రాజు
సంగీత : థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : తిరు
కూర్పు : రూబెన్, షమీర్
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమానే “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం.
కథ:
ఇక కథ లోకి వస్తే.. అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్య మూర్తి(శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి(ఎస్ జే సూర్య) కి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ నందన్(రామ్ చరణ్) వస్తాడు. మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ ని ఏపీ ముఖ్యమంత్రి గా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు? ఇలా రామ్ నందన్ నడుమ మోపిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్న(మరో రామ్ చరణ్) కి సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వారి అంచనాలుకి ఏమాత్రం తీసి పోని విధంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా విషయంలో శంకర్ చెప్పినట్టే ఆడియెన్స్ ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెర వైపే చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో క్రేజీ స్క్రీన్ ప్లే తో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్ గాని కొన్ని ట్విస్ట్ బాగా ఎగ్జైట్ చేస్తాయి.
ఇక వీటికి మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు, తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. ఇక నటీనటుల్లో అయితే మొట్ట మొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్ కోసమే.. శంకర్ సినిమాల్లో ముఖ్యం అయ్యిందనే ఆ ఎమోషన్స్. తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పెర్ఫామెన్స్ లని చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి గేమ్ ఛేంజర్ లో కూడా అన్ ప్రెడిక్టబుల్ గా రామ్ చరణ్ తన నటనతో షాకిచ్చాడు.
డెఫినెట్ గా తన కెరీర్లో నిలిచిపోయే మరో ఐకానిక్ పెర్ఫార్మన్స్ ని తను అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘రంగస్థలం’ లో ఒక చిట్టిబాబు ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో అప్పన్న అని చెప్పాల్సిందే. ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియెన్స్ ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలోని అమాయకత్వం ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక రామ్ నందన్ గా కూడా స్టైలిష్ లుక్స్ లో అలాగే తన యంగ్ లుక్స్ లో చరణ్ ట్రీట్ ఇస్తాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా తనలోని వేరియేషన్స్ అదిరిపోయాయి అంతే.
ఇక సినిమాలో అంజలి కోసం చెప్పుకోవాలి. చరణ్ కెరీర్ లో ఆ పాత్రలు ఎలాగో అంజలి కెరీర్లో ఈ పాత్ర కూడా మిగిలిపోతుంది. తన రోల్ లో అద్భుతంగా అంజలి నటించారు. తనపై వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే హృదయం కదిలేలా అనిపించక మానవు. ఇంకా విలన్ రోల్ లో చేసిన ఎస్ జే సూర్య తన మార్క్ విలనిజాన్ని చూపించారు. చరణ్ కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే తన మ్యానరిజం, లుక్స్ తో తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని తను అందించారు.
ఇక నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్ లో కనిపించారు. ఇంకా హీరోయిన్ కియార అద్వానీ తన గ్లామర్ తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరిస్తుంది. అలాగే సునీల్ నుంచి మళ్లీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. ఇంకా కామెడీ బ్రహ్మ బ్రహ్మానందంపై ఉన్న ఒక కామెడీ సీన్ బాగుంది. జైరాం కామిక్ రోల్ లో అలరిస్తారు. సినిమాలో పాటలు, గ్రాండ్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ సినిమాలో పండాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఉండే పవర్స్ ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్టాఫ్, సెకండాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో సాలిడ్ నరేషన్ ఉంది కానీ ఈ తరహా కథలు కొత్తేమి కాదు. మన తెలుగు లోనే హీరో సాయి ధరమ్ తేజ్ పై వచ్చిన రిపబ్లిక్ లో జస్ట్ కొన్ని సన్నివేశాల తరహాలో ఇందులో తలపించవచ్చు. అలాగే ఫస్టాఫ్ లో మొదటి పది పదిహేను నిమిషాలు కొంచెం సో సో గానే ఉంటుంది. రామ్ చరణ్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.
అలాగే జరగండి సాంగ్ విజువల్స్ విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాగలేవు. ఆ సాంగ్ కి థమన్, ఎస్ జె సూర్య చాలా హైప్ ఇచ్చారు కానీ ఆ రేంజ్ లో లేదు. ఇంకా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడా లైట్ గా రొటీన్ అనిపించవచ్చు. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయ్యినట్టు తన ఫ్యాన్స్ కి అనిపించవచ్చు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో దిల్ రాజు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. జరగండి సాంగ్ థియేటర్స్ లో డిజప్పాయింట్ చేస్తుంది. మిగతా అన్ని పాటలు మాత్రం శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గ లెవెల్లో క్రేజీ థాట్స్ తో ఉన్నాయి. థమన్ పై చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు కానీ డెఫినెట్ గా శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఇచ్చాడు. ఎలివేషన్స్ స్కోర్ మాత్రమే కాకుండా ఒక పిల్లనగ్రోవి ఎమోషనల్ బిట్ అయితే సినిమాలో కదిలిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. తిరు సినిమాటోగ్రఫీ రిచ్ గా గ్రాండ్ విజువల్స్ తో బాగుంది. నానా హైరానా కూడా పెట్టి ఉంటే బాగుండేది.
ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే.. గత కొన్నాళ్ల నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానిని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. కథ కార్తిక్ సుబ్బరాజ్ ది అయినప్పటికీ తన మార్క్ కథనం, బలమైన ఎమోషన్స్ తో నడిపిన విధానం బాగుంది. ప్రతీ నటీనటులు నుంచి బెస్ట్ ని తను రాబట్టారు. స్క్రీన్ ప్లే నడిపిన విధానం సినిమాలో ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్ గా తన వర్క్ సినిమాకి బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “గేమ్ ఛేంజర్” కొంచెం ప్రిడక్టబుల్ మరికొంచెం ఎక్కువ అన్ ప్రిడక్టబుల్ సాలిడ్ ఎమోషన్స్ తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. తన కెరీర్లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత అప్పన్నగా ఆడియెన్స్ కి గుర్తుండిపోతాడు. నిజానికి తనపై సినిమాలో ఇంకా ఎక్కువసేపు సన్నివేశాలు ఉన్నా బాగుణ్ణు అనిపిస్తుంది. తను సహా ఇతర ప్రధాన తారాగణం సినిమాలో బాగా చేసారు. కదిలించే ఎమోషన్స్ మాంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొటీన్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఇవి పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team