‘మిర్చి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శక-రచయిత కొరటాల శివ, తన రెండో సినిమా ‘శ్రీమంతుడు’తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయారు. ‘శ్రీమంతుడు’తో మహేష్ కెరీర్‌కు మరో బిగ్గెస్ట్ హిట్‌ను అందించి టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయిన కొరటాల శివ, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖర్లో జనతా గ్యారెజ్ సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఇదిలా ఉంటే జనతా గ్యారెజ్ మొదలవ్వకముందే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే నాలుగో సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కొరటాల శివ నాలుగో సినిమా ఉండనుందని, ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ కూడా అప్పుడే మొదలైందని తెలుస్తోంది. కొరటాల శివ ‘జనతా గ్యారెజ్’ పూర్తి చేసేలోగా, రామ్ చరణ్ ‘తని ఒరువన్’ రీమేక్‌ను పూర్తి చేసి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక గతంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయి దాదాపుగా సెట్స్‌పైకి వెళ్ళే సమయంలో అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ కానుందనే ప్రచారం రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.